సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ భగాయత్‌లో హెచ్‌ఎండీఏ స్థలాలకు రక్షణ కరువైంది. లే అవుట్‌లో మిగిలిన స్థలాలు యథావిధిగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇలా ఆక్రమించిన స్థలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన షెడ్‌లను నిర్మించి వ్యాపారులకు అద్దెలకు ఇస్తున్నారు. గతంలో ఇలాంటి ఆక్రమణలపై హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. నిఘా, ఎన్‌ఫోర్స్ విభాగం అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయినప్పటికీ కొందరు కబ్జారాయుళ్లు మరోసారి అదే స్థలాలను ఆక్రమించి పలు వ్యాపార సంస్థలకు అద్దెలకు ఇస్తున్నారు.
ఒక్కో షెడ్డు నుంచి ప్రతి నెలా రూ.లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పల్ భగాయత్‌లోని తూర్పు వైపు రోడ్ నంబర్ 35 ప్రాంతంలో సుమారు 150 గజాల స్థలాన్ని ఒక వ్యక్తి దర్జాగా కబ్జా చేసి ఏకంగా గదులను నిర్మించి అద్దెకు ఇచ్చినట్లు స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. లేఅవుట్‌కు నలువైపులా మూలల్లో ఇలా మిగిలిపోయిన స్థలాలే లక్ష్యంగా కబ్జాల పర్వం కొనుసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
భారీ లే అవుట్..
● మహా నగరానికి తూర్పు ముఖద్వారంలో హెచ్ ఎండీఏ ఏర్పాటు చేసిన అతిపెద్ద లే అవుట్ ఇది. వరంగల్ ప్రధాన రహదారికి, విజయవాడ హైవే కు అందుబాటులో ఉండడంతో నిర్మాణ సంస్థలు, రియల్టర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ లే అవుట్‌లో హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించింది. హైదరాబాద్ మెట్రో రైల్ కోసం ప్రభుత్వం అప్పట్లో రైతుల నుంచి పెద్ద మొత్తంలో భూములను సేకరించిన సంగతి తెలిసిందే. ఇలా ఉప్పల్ భగాయత్‌లో సేకరించిన సుమారు 713 ఎకరాల భూములలో 90 ఎకరాల వరకు మెట్రో రైల్ కోసం, మరో వంద ఎకరాలు జలమండలికి కేటాయించారు. మిగతా భూమిలో హెచ్‌ఎండీఏ లే అవుట్‌ను అభివృద్ధి చేసింది.
● రైతుల నుంచి సేకరించిన భూమికి ఎకరానికి వెయ్యి గజాల చొప్పున అందజేశారు. మరో 413 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ప్లాట్‌ల విక్రయానికి చర్యలు చేపట్టింది. 450 గజాల నుంచి గరిష్టంగా 11 వేలకు పైగా చదరపు గజాల వరకు విస్తీర్ణం కలిగిన సుమారు 3500 ప్లాట్‌లను హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా అమ్మకానికి పెట్టింది. ఈ స్థలాలను కొనుగోలు చేసిన బిల్డర్లు, రియల్టర్లు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి విక్రయించారు. మధ్యతరగతి వర్గాలు సైతం ఇక్కడ ప్లాట్‌లు కోనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
హెచ్‌ఎండీఏ స్థలాలు ఉన్నాయి..
ఇప్పటి వరకు మూడుసార్లు ఉప్పల్ భగాయత్‌లో స్థలాల అమ్మకానికి ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించిన హెచ్‌ఎండీఏ రూ.వందల కోట్లు ఆర్జించింది. గతేడాది జూన్ నెలలో మూడోసారి 63 ప్లాట్‌లను విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. కానీ కొన్ని ప్లాట్‌లు మాత్రమే అమ్ముడయ్యాయి. వాటిలో ఇంకొన్ని మిగిలి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్దత దృష్ట్యా ఉప్పల్ భగాయత్‌తో పాటు హెచ్‌ఎండీఏకు ఉన్న సొంత స్థలాల్లో మరెక్కడా ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించేందుకు అధికారులు సాహసించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఆక్రమణల ఉదంతాలు హెచ్‌ఎండీఏ స్థలాల రక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment