బల్దియాలో బలపడాలి
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరముందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు– 2024 పేరుతో ఈ నెల 7, 8, 9వ తేదీల్లో నగరంలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ పరిఽధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని, పార్టీ, ప్రభుత్వం సమన్వయం చేసుకుంటేనే విజయాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ హయాంలో అమలు కాని పథకాలను.. కాంగ్రెస్ ఒక్క సంవత్సరంలో అమలు చేసి చూపించిందన్నారు. క్షేత్ర స్థాయిలో చేస్తున్న పనులు కూడా చెప్పడంలో కాంగ్రెస్ కార్యకర్తలు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుంచి కలిసికట్టుగా పని చేయాలని ఆమె సూచించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తే మేయర్ పదవి మనకే దక్కుతుందన్నారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీలో డివిజన్ల వారీగా పాదయాత్ర చేపట్టి పార్టీ బలోపేతం కోసం కార్యాచరణ దిశగా పయనించాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విజయోత్సవాలకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి భారీ జన సమీకరణ చేయాలన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్, ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు ఫహీం, నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయి కుమార్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సమీర్‌వుల్లాఖాన్ పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రజాపాలన.. విజయోత్సవాలను జయప్రదం చేయాలి
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ
Comments
Please login to add a commentAdd a comment