చుక్కేసి చంపేస్తున్నారు.. యమ డ్రింకరులు! | - | Sakshi
Sakshi News home page

యమ డ్రింకరులు!

Published Mon, Dec 2 2024 8:00 AM | Last Updated on Mon, Dec 2 2024 3:25 PM

-

నిషాలో వాహ‌నాలు న‌డిపి ఇత‌రుల ప్రాణాల‌తో చెల‌గాటం

తాజాగా లంగర్‌హౌస్‌లో భార్యాభర్తలు బలి

నిషాలో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలతో చెలగాటం

సిబ్బందితో ఇబ్బందే ప్రధాన కారణం

పూర్తి ఫలితాలు ఇవ్వని పోలీసుల చర్యలు

మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు మందుబాబులు. నిషాలో యమ కింకరులే అవుతున్నారు. నగరంలో శనివారం రాత్రి మరో దారుణం జరిగింది. నిషాలో ఉన్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. ప్రైవేట్‌ ఉద్యోగి ప్రణయ్‌ మద్యం మత్తులో బండ్లగూడ నుంచి ఖైరతాబాద్‌కు కారులో వెళ్తూ.. సన్‌సిటీ వద్ద రెండు వాహనాలను ఢీకొట్టి తప్పించుకుని వచ్చాడు. ఆ తర్వాత లంగర్‌హౌస్‌ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దంపతులు మోన ఠాకూర్‌, దినేష్‌ల ఉసురు తీశాడు. – సాక్షి, సిటీబ్యూరో

అత్యంత తీవ్రమైన ఉల్లంఘన..
ట్రాఫిక్‌ పోలీసులు రహదారి ఉల్లంఘనల్ని వాటి తీవ్రతను బట్టి ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. మొదటిది వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరమైనవి, రెండోది ఎదుటి వారికి ప్రమాదకరమైనవి. ఈ రెంటికీ మించి తీవ్రమైన వాటిని మూడో కేటగిరీలోకి చేరుస్తారు. ఈ ఉల్లంఘనల వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం పొంచి ఉంటుంది. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం వంటివి మొదటి కేటగిరీలో ఉంటే డ్రంకన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌ తదిత రాలు మూడో కేటగిరీలోకి వస్తాయి. మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల చోదకుడి విషయం ఏమో గాని వరుసపెట్టి తోటి, ఎదుటి వ్యక్తులు, వారి కుటుంబాలు మాత్రం కుదేలవుతున్నాయి.

సిబ్బంది కొరతతో ఇబ్బందులు..
రాత్రి వేళల్లో మద్యం తాగేవారికి, ఆ స్థితిలో వాహనా లు నడిపే వారికి సమయం, సందర్భం అంటూ ఉండదు. డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించే ట్రాఫిక్‌ పోలీసులకు మాత్రం ఇవి ఉంటాయి. ప్రధానంగా వీకెండ్స్‌గా పిలిచే శుక్ర, శనివారాలతో పాటు అప్పుడప్పుడు ఆకస్మికంగా ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఈ డ్రైవ్స్‌ నిర్వహణకూ ప్రత్యేక సమయం అంటూ ఉంటోంది. సాధారణంగా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున ఒంటిగంట లేదా రెండు గంటల వరకు మాత్రమే చేపట్టగలుగుతున్నారు. ఈ విధులు నిర్వర్తించిన, పర్యవేక్షించిన వారే మరుసటి రోజూ విధులకు హాజరు కావాల్సి ఉండటంతో ఇలా చేయా ల్సి వస్తోంది. ట్రాఫిక్‌ విభాగంలో ఉన్న సిబ్బంది కొర త నేపథ్యంలో ప్రతి రోజూ, రాత్రంతా డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలు చేపట్టలేకపోతున్నారు. దీన్నే మందుబాబులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

తెలివిమీరుతున్న మందుబాబులు..
ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించే రోజులు, సమయాలు, స్థలాలను గమనిస్తున్న మందుబాబులు తెలివిమీరి ప్రవర్తిస్తున్నారు. డ్రంక్‌ డ్రైవింగ్‌పై తనిఖీలు ఉండని రోజుల్లో, సమయాల్లో రెచ్చిపోతున్నారు. అవి జరిగే వారాంతాల్లోనూ గల్లీలు, ఇతర మార్గాలను అనుసరిస్తూ పోలీసులకు చిక్కట్లేదు. కొందరైతే ఏకంగా వాట్సాప్‌ గ్రూపుల్లో డ్రంక్‌ డ్రైవింగ్‌ జరిగే ప్రాంతాలు, సమయాలకు సంబంధించిన సమాచార మార్పిడి చేసుకుంటూ వాహనాలపై దూసుకుపోతున్నారు. ఇదే అనేక సందర్భాల్లో ప్రమాదహేతువుగా మారుతోంది. మందుబాబులు వాహనం నడుపుతూ తమంతట తాము ప్రమాదానికి లోనైన ఉదంతాలు అసలు వెలుగులోకే రావడం లేదు. ఎదుటి వారిని ఢీకొట్టినప్పుడో, సంచలనాత్మక ఉదంతం జరిగినప్పుడో మాత్రమే ఈ విషయం వెల్లడవుతోంది.

మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కడంతో పాటు ర్యాష్‌ డ్రైవింగ్‌, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలకు కారణమైన, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో సమగ్ర ఎలక్ట్రానిక్‌ డేటాబేస్‌ సిద్ధం చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారి వివరాలను ఆధార్‌ నంబర్‌తో సహా పొందుపరుస్తున్నారు. ఈ వివరాలను వివిధ రకాలైన సేవలు అందించే విభాగాలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా విభాగాలు ఇందులోని వివరాలు సరిచూసుకుని తదుపరి చర్యలు తీసుకోనున్నాయి. ప్రధానంగా పాస్‌పోర్ట్‌, వీసా, జాబ్‌ వెరిఫికేషన్‌ సమయాల్లో ఇలాంటి కేసులు అడ్డంకి కానున్నాయని హెచ్చరిస్తున్నారు.

నగరంలో డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులు ఇలా.. 2023 2024 (నవంబర్‌ 15 వరకు)

మొత్తం కేసులు 53,975 48,735

జైలు శిక్షలు పడినవి 3,882 3,538

జరిమానా రూ.9.79 కోట్లు రూ.9.71 కోట్లు

సస్పెండ్‌ అయిన లైసెన్సులు 589 245

బీఏసీ కౌంట్‌ 200 దాటిన వాళ్లు 4,256 3,689

(రక్తంలో ఉండే ఆల్కహాల్‌ శాతాన్ని బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ (బీఏసీ) అంటారు. 100 ఎంఎల్‌ రక్తంలో 30 ఎంజీ ఆల్కహాల్‌ ఉంటే అది ఉల్లంఘన కిందికి వస్తుంది)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement