చిన్నబోయిన చలి!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత తగ్గింది. గత ఏడాది ఇదే సమయానికి చలితో ప్రజలు వణికిపోయారు. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో ఇదెక్కడి చోద్యం అంటూ విస్తుపోతున్నారు. ఈ నెల చివరి వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
కారణాలేంటి..?
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, ఏపీల్లోనూ గత వారంలో వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా అక్కడి నుంచి తేమ గాలులు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా పొడిగాలులతో చలి తీవ్రత పెరుగుతుంది. కానీ తేమ గాలులతో ఉష్ణోగ్రతలు పెరిగి, చలి తీవ్రత తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందన్నారు. ఆ తర్వాత తేమ తగ్గితే ఉష్ణోగ్రతలు తగ్గి, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
కొద్ది రోజులుగా తగ్గిన చలి ప్రభావం
బంగాళాఖాతంలో అల్పపీడనమే కారణం
ఈ నెల చివరి వరకూ ఇదే పరిస్థితి
సర్వసాధారణమే..
పశ్చిమ పసిఫిక్ మహా సముద్రం నుంచి వచ్చిన గాలుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. చలికాలం ప్రారంభంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మళ్లీ కొద్దిరోజుల పాటు చలి తీవ్రత తగ్గుతుంది. ఏటా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే పది రోజులు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణమైన విషయం.
– బాలాజీ, తెలంగాణ వెదర్‌మ్యాన్
Comments
Please login to add a commentAdd a comment