సమన్వయంతోనే నేర పరిశోధన సులువు
బంజారాహిల్స్: నేరాల పరిశోధనలో పోలీసు విచారణ అధికారితో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమన్వయంతో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూం లా కాలేజీ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజీ క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ కాంపిటీషన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన న్యాయ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గతంలో పోలిస్తే క్రైం సీన్ దర్యాప్తు చేసే విషయంలో చాలా మార్పులు వచ్చాయని ఒకప్పుడు సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాదని కానీ ఇప్పుడు అత్యాధునిక పరికరాలు, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందన్నారు. దీంతో నేరస్తులు తప్పించుకోవవడం సాధ్యం కావడం లేదన్నారు. క్రైం ఇన్వెస్టిగేషన్‌లో ఐవో, ఎఫ్‌ఎస్‌ఎల్, పీపీ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తే నేరస్తులకు శిక్ష పడటంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. న్యాయ విద్యార్థులు ఆలోచనా విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలని ఎంతో ఓపిక ఉండాలని అప్పుడే గొప్ప న్యాయవాదులుగా మారతారన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో కొన్ని కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తీరును విద్యార్థులతో కలిసి ఆయన పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఫోరెన్సిక్ డీడీ శారద అవదానం, నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ నందిని, సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, లా కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గీతా, ఇబ్రహీం అలీ సిద్దిఖీ, అక్బర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ కె. శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment