కల్యాణ లక్ష్మి చెక్కు కోసం
రూ.10 వేలు డిమాండ్..
హస్తినాపురం: కల్యాణలక్ష్మి చెక్కు మంజూరు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన నల్లగొండ జిల్లా, డిండి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ నాయక్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. డిండీ మండలం, పడమటి తండాకు చెందిన పాండునాయక్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతను తన కుమార్తె పెళ్లికి సంబందించి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆర్‌ఐ శ్యాంనాయక్‌ను కలిసి కల్యాణ లక్ష్మి నిధులు మంజూరు చేయించాలని కోరాడు. అయితే అందుకు ఆర్‌ఐ రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఒప్పందం ప్రకారం రూ.5 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. మిగతా మొత్తం ఇస్తేనే చెక్కు మంజూరు చేయిస్తానని ఆర్‌ఐ చెప్పడంతో అతను నల్లగొండ జిల్లా, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చందర్ సూచన మేరకు పాండునాయక్ శుక్రవారం హస్తినాపురం, ఊర్మిళానగర్‌లోని ఆర్‌ఐ శ్యాంనాయక్ ఇంట్లో అతడికి నగదు అందజేస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అతని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలకు సంబందించిన వివరాలు వెల్లడించేందుకు డీఎస్పీ నిరాకరించారు.
ఒకే రోజు ఇద్దరు ఉద్యోగుల పట్టివేత
ఏసీబీ అధికారులు శుక్రవారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు కల్యాణ లక్ష్మి చెక్కు మంజూరు చేసేందుకు రూ. 10 డిమాండ్ చేసి పట్టుబడగా, మరొకరు రిటైర్ ఉద్యోగి బెనిఫిట్స్ అందజేసేందుకు రూ. 17 డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే..
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు రూ.17 వేలు వసూలు
సుల్తాన్‌బజార్: రూ. 3 వేలు లంచం తీసుకుంటూ కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ ఆర్.సంతోష్ తివారీ ఏసీబీకి పట్టుబడ్డాడు. పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి బెన్‌ఫిట్స్ కోసం సంతోష్ తివారి రూ.20 వేలు డిమాండ్ చేశాడు. రూ.17 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న అతను శుక్రవారం రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు సంతోష్ తివారిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment