క్షయనివారణలో భాగస్వామ్యం కావాలి
జగిత్యాల: క్షయనివారణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. క్షయ విజేతలకు టీబీ అలర్ట్ ఇండియా, ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం శిక్షణ కల్పించారు. క్షయవ్యాధి లక్షణాలు, నివారణపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా క్షయవ్యాధికి గురై సంపూర్ణ చికిత్స వాడి కోలుకున్న టీబీ చాంపియన్స్ గ్రామాల్లో తిరిగి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి స్వాతి, డీపీఎం కట్ట హరీశ్, ఎంపీహెచ్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
కోరుట్ల: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని డీఈవో రాము అన్నారు. పట్టణంలోని కాల్వగడ్డ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లో మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లల స్థాయిని గుర్తించి ఫలితాలు రాబట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఆంగ్లంలో మాట్లాడేలా బోధన జరగాలన్నారు. ఎంఈఓ నరేశం, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అడ్డగట్ల శ్రీనివాస్, ఎంఎన్‌ఓ రాజేంద్రప్రసాద్, రాజేశం, దరమ్‌దీప్, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించండి
జగిత్యాలటౌన్: మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 48గంటల నిరసన దీక్షలో భాగంగా రెండోరోజు కలెక్టరేట్ ఎదుట బైటాయించారు. అక్కడే వంటావార్పు చేపట్టి భోజనాలు చేశారు. కలెక్టరేట్‌లో సిబ్బందికి వినతిపత్రం అందించారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు ముత్యాల గౌరమ్మ, వెల్మలపల్లి వెంకటాచారి, పద్మ, సరిత, గంగవ్వ, రుక్మ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురిని రెవెన్యూ డివిజన్ చేయండి
ధర్మపురి: ధర్మపురిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ధర్మపురిని రెవెన్యూ డివిజన్ చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రజలు రాస్తారోకోలు, నిరసనలు చేపట్టారని, అయినా వినిపించుకోలేదని, తాజాగా డివిజన్‌గా ప్రకటించాలని సభాపతికి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment