అడ్డం తిరిగిన సుపారీ
ధర్మపురి: ధర్మపురి మండలం నేరెళ్ల గుట్టల్లో గుర్తు తెలియని శవమంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న వదంతులను పోలీసులు శనివారం చేధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓ యువకుడిని తీసుకొచ్చి దారుణంగా హత్య చేసి కాల్చివేశారని నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. నేరెళ్లకు చెందిన గోపాల్, ఇదే మండలం కమలాపూర్‌కు చెందిన గండికోట శేఖర్ స్నేహితులు. నేరెళ్లకు చెందిన మెరుగు లక్ష్మణ్ ముంబయిలోని ఓ బీచ్‌లో ఓ యువకుడిని చంపాలని గోపాల్‌ను ఫోన్‌లో సంప్రదించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ సూర్యప్రకాశ్‌సింగ్ ఉన్నాడని, ఎంత పెద్ద పనైనా చేసి పెడతాడని, అతడు ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నాడని, ఈ విషయం మధ్యవర్తి తనకు తెలిసిందని గోపాల్ లక్ష్మణ్‌కు తెలిపాడు. సూర్యప్రకాశ్‌తో హత్య వివరాలను ఫోన్‌లోనే మాట్లాడి రూ.4 లక్షలకు సుపారి కుదుర్చుకున్నారు. కొద్దిరోజులకు సూర్యప్రకాశ్ డబ్బులు ఇవ్వాలని గోపాల్‌ను అడగగా.. ఎవరినీ హత్య చేయాల్సిన అవసరం లేదని, ఇదే విషయాన్ని లక్ష్మణ్ చెప్పాడని కూడా సూర్యప్రకాశ్‌కు వివరించాడు. అయితే సుపారి మాట్లాడుకున్నాక డబ్బులు తప్పకుండా ఇవ్వాల్సిందేనని, లేకుంటూ మీ తండ్రి రమేశ్‌ను చంపేస్తానని గోపాల్‌ను బెదిరించాడు.
సూర్యప్రకాశ్ హత్యకు పక్కా ప్రణాళిక
తన తండ్రినే చంపుతానంటాడా.. అని కక్ష పెంచుకున్న గోపాల్ సూర్యప్రకాశ్ హత్యకు పథకం వేశాడు. ఇందుకు కమలాపూర్‌కు చెందిన గండికోట శేఖర్‌ను కలిశాడు. ముంబయికి వస్తే డబ్బులిస్తామని నమ్మబలికారు. ఇద్దరూ కలిసి ఈనెల 12న ముంబయి వెళ్లి సూర్యప్రకాశ్‌ను దొరకబుచ్చుకున్నారు. అదే రోజు కారులో నేరెళ్లకు తీసుకొచ్చారు. ఈనెల 13న అర్ధరాత్రి నేరెళ్ల సాంబశివ ఆలయం వద్దకు తీసుకెళ్లి సూర్యప్రకాశ్ తలపై గోపాల్ బండరాయితో మోదాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. శవాన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంగాపూర్ మండలం బట్టపెల్లి, పోతారం వెళ్లే రహదారి మీదుగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కట్టెల్లో పెట్టి పెట్రోలు పోసి దహనం చేశారు. ఇటీవల కొందరు అటవీప్రాంతానికి వెళ్లగా.. అక్కడ గుర్తు తెలియని వ్యక్తిని కాల్చివేసిన ఆనవాళ్లు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. గుర్తు తెలియని శవంగా భావించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితులు శనివారం పోలీసులకు లొంగిపోయి హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులకు వివరించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు గోపాల్‌తోపాటు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను మరింత లోతుగా విచారిస్తున్నట్లు వెల్లడించారు. సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్ ఉన్నారు.
ఓ వ్యక్తి హత్యకు ప్లాన్..?
డబ్బులు ఇవ్వనందుకు బెదిరింపులు
బెదిరించాడని హత్యకు పక్కా ప్లాన్
పెట్రోల్ పోసి నిప్పంటించి మర్డర్
నిందితులు ధర్మపురి వాసులు
హతుడిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
Comments
Please login to add a commentAdd a comment