‘సూరమ్మ’ పరిహారం కొలిక్కి వచ్చేనా..?
● ప్రాజెక్టు కుడికాలువకు 351 ఎకరాలు అవసరం ● మార్కెట్ ప్రకారం పరిహారం ఇవ్వాలంటున్న రైతులు ● ప్రభుత్వానికి నివేదిస్తామంటున్న అధికారులు
కథలాపూర్: కథలాపూర్ మండలంలోని కలిగోట శివారులోని సూరమ్మ ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆ కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులు తమ భూములు ఇవ్వబోమని, మార్కెట్ ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని ఏ గ్రామంలో గ్రామసభ నిర్వహించినా.. అధికారులకు ఇలాంటి డిమాండే వ్యక్తమవుతోంది.
9 గ్రామాలు.. 351 ఎకరాలు
ఈ ప్రాజెక్టు ద్వారా కథలాపూర్, మేడిపెల్లి, బీమారం మండలాల్లో 50 వేల ఎకరాలకు నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కుడికాలువ కోసం కలిగోట, అంబారిపేట, పోతారం, ఇప్పపెల్లి, గంభీర్‌పూర్, తాండ్య్రాల, పోసానిపేట, దుంపేట, చింతకుంట గ్రామాల్లో 351.21 ఎకరాల భూమి అవసరమవుతోంది. ఈ మేరకు అధికారులు గత నెల గ్రామాలవారీగా భూనిర్వాసితులతో గ్రామసభలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. తమకు ఉన్నదే కొద్ది భూమి అని, అది కూడా కాలువ పనుల్లో పోతే ఉపాధి కోల్పోతామని కొందరు రైతులు అధికారులకు వివరించారు. మరికొందరు భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేదా మా ర్కెట్ ప్రకారం ఎకరాకు రూ.40లక్షల చొప్పున ఇవ్వాలని అంటున్నారు. అందరి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పరిహారం విషయం కొలిక్కి వస్తుందా..? లేదా..? అని భూనిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment