● పిల్లలు అడిగిన ప్రతిదాన్నీ సమకూర్చడం ఉత్తమ పేరెంటింగ్ లక్షణంగా భావిస్తున్న తల్లిదండ్రులకు ప్రస్తుతకాలంలో కొదవలేదు. కోరింది కొనివ్వకపోతే కొంత సేపే ఏడుస్తారు. సంస్కారం అందించకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారని గుర్తిస్తే మంచిది.
● చాలా మంది ఫిర్యాదు ఏమిటంటే మా పిల్లలు చెపితే వినడం లేదండీ అని.. నిజమే పిల్లలు చెపితే వినరు.. మనం చేసినట్లు చేస్తారు. చూసి నేర్చుకుంటారు. వద్దని వారించాలనుకునే ఏ విషయం అయినా సరే పెద్దవాళ్లుగా మనం ఆచరిస్తే చాలు అది చూసి వాళ్లే నేర్చుకుంటారు.
● అంతే కానీ పెద్దరికం పేరుతో ఏది చెపితే అది వినాలని పంతం పనికి రాదు. నచ్చచెప్పడం, నచ్చేలా చెప్పడం, నచ్చేవరకు చెప్పడం పెద్దల కర్తవ్యం కావాలి. అదీ బాధ్యతాయుతమైన పెంపకం అంటే.
● మేం పడ్డ కష్టం పిల్లలు పడకూడదని కడుపు కట్టుకుని డబ్బు సంపాదనే లక్ష్యంగా పెద్దవాళ్ల వ్యవహారం నడుస్తోందిప్పుడు. పిల్లల్ని కష్టపడకుండా పెంచాలనుకోవడమే పెద్దస్వార్థం. కష్టపెట్టకుండా కాదు కష్టం విలువ తెలిసేలా పెంచడం చాలా ముఖ్యం.
● ఏదో పని చేస్తే తప్ప పిల్లలకు డబ్బులు ఇవ్వకూడదు. ఉచితంగా వచ్చే డబ్బు సోమరితనాన్ని పెంచుతుంది. పెంకితనాన్ని పెంచుతుంది. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచన కలిగిస్తుంది.
● ఆండ్రాయిడ్ ఫోన్లు అందరి ఇళ్లల్లో ఉంటున్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లు కూడా బాగా పెరిగాయి. అవసరం ఉన్నా, లేకపోయినా ఆఫర్లున్నాయనే సాకుతో పనికి రాని వస్తువులను కొనుగోలు చేసి డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసే సంస్కృతి పెరిగిపోయింది. ఫ్రీగా వచ్చినా సరే అవసరం లేని వస్తువుల కొనుగోళ్లపైన నియంత్రణ ఉండాలి. ఆఫర్ల పేరుతో ప్రస్తుతానికి అవసరం లేని ఏ ప్రొడక్ట్స్ జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment