గాంధీభవన్‌ను బద్దలు కొడతాం..
జనగామ: కమళదళం తలుచుకుంటే హైదరాబాద్ గాంధీభవన్‌ను బద్దలు కొడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో దశమంతరెడ్డి ఆధ్వర్యాన మంగళవారం ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీగా వచ్చిన బీజేపీ శ్రేణులు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ పోలీసులు అప్పటికే చౌరస్తాకు చేరుకుని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దిష్టిబొమ్మను పోలీసులు లాక్కోగా.. అక్కడే సీఎం ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తగుల బెట్టే సమయంలో పోలీసులు భగ్నం చేశారు. దీంతో కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం దశమంతరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గుండాలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. చిల్లర రౌడీలు, వీధి గుండాలకు తమ పార్టీ భయపడదని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉడుగుల రమేశ్, కొంతం శ్రీనివాస్, దుబ్బ రాజశేఖర్‌గౌడ్, ఉపేందర్, రాజు, చింతకింది సంతోష్, బొమ్మగాని అనిల్‌గౌడ్, మురళి, మహేశ్, సత్తయ్య, ఆవుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ఆరుట్ల దశమంతరెడ్డి
సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment