మిగిలింది 12 రోజులే..
● 26తో ముగియనున్న పురపాలిక పదవీకాలం
● తీవ్ర నిరాశలో పాలకవర్గాలు
● ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని ఆవేదన
● మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్నవారు మాత్రమే వార్డు సమస్యలపై దృష్టి
● రిజర్వేషన్లు మారుతాయనే ప్రచారం
అచ్చంపేట: మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం మరో 12 రోజుల్లో ముగియనుంది. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని పాలకవర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతికి నిధులు రాకపోవడంతో అభివృద్ధి చేయలేకపోయామని చాలా మంది కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయలేదని వాపోతున్నారు. అయితే మళ్లీ పోటీ చేయాలనే ఆలోచన ఉన్న వారు మాత్రమే వారి వార్డుల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరించడం వంటివి చేయిస్తున్నారు. పోటీ చేయాలనే ఆలోచన లేనివారు మాత్రం వార్డులను గాలికి వదిలేశారు.
అవిశ్వాస తీరా్మానాలతో..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు చెందిన నారాయణపేట మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్ (బీఆర్‌ఎస్)పై అవిశ్వాసం పెట్టాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంద్‌గౌడ్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా షబ్బీర్ అహ్మద్ ఎన్నికయ్యారు.
● కోస్గి మున్సిపల్ చైర్‌పర్సన్ మ్యాకల శిరీష (బీఆర్‌ఎస్)పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 11 మంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఓటేయడంతో ఆమె గద్దె దిగారు. వివిధ నాటకీయ పరిణామాల మధ్య నెలరోజుల తర్వాత వైస్ చైర్మన్ అన్నపూర్ణను చైర్మన్‌గా ఎంపిక చేశారు. మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
● వనపర్తి మన్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ (బీఆర్‌ఎస్)పై ఆరు నెలల క్రితం అవిశ్వాసం తీర్మానం పెట్టగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పుట్టపాగ మహేష్ నూతన చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
● కొల్లాపూర్ బీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గారు. ఆ తర్వాత చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన రమ్యకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
● అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా బీజేపీతో కలిపి 15 మంది కౌన్సిలర్లతో ఎక్స్‌అఫీషియో సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో నెగ్గారు. మారిన పరిణామాల్లో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్ గార్లపాటి శ్రీనివాసులు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
● జడ్చర్ల బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మిపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన పుష్పలత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
ఎన్నికలా.. ఇన్‌చార్జ్ పాలనా
ఈ నెల 26న మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగుస్తోంది. ఇందుకు ఇంకా 12 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చే వరకు ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతుంది. 2023 జూన్ నుంచి పట్టణ ప్రగతి నిధులు రావడం లేదు. ప్రతినెలా ఆయా మున్సిపాలిటీల జనాభా ప్రకారం రూ.30 నుంచి రూ.60 లక్షల వరకు నిధులు వచ్చేవి. ఈ నిధులు ఇప్పుడు నిలిచిపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. ఇతర ఎలాంటి నిధులు రాకపోవడంతో చేసిన పనుల బిల్లులు పెండింగ్ ఉన్నాయి.
రిజర్వేషన్లు మారే అవకాశం
గత రెండు ఎన్నికల్లో రిజర్వేషన్లు మారాయి. ఈసారి కూడా రిజర్వేషన్లు మారుతాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గత ప్రభుత్వం రిజర్వేషన్లు పదేళ్లపాటు కొనసాగేలా మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం రిజర్వేషన్లు మార్పు చేస్తూ అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మారుతాయి. రిజర్వేషన్లు మారితే అవకాశం వస్తుందా.. రాదా అని ఆశావహులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఉన్న వార్డుల్లో అభివృద్ధి చేసిన వారు వార్డు మారితే చేసిన వార్డులో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తామని చెబుతున్నారు. అధికార కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు సవాల్‌గా తీసుకుని పనిచేసే అవకాశం ఉంది.
● ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా అచ్చంపేట, జడ్చర్ల మినహా 2020 జనవరి 22న 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. 25న ఓట్ల లెక్కింపు జరిగాయి. వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అయిజ, గద్వాలతోపాటు.. కొత్త మున్సిపాలిటీలైన భూత్పూర్, పెబ్బేరు, వడ్డేపల్లి, మక్తల్, కొత్తకోట, కోస్గి, కొల్లాపూర్, ఆత్మకూర్, అమరచింత, అలంపూర్‌లకు ఎన్నికలు నిర్వహించగా.. బీఆర్‌ఎస్ 8 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ సాధించగా.. ఇతరుల అండతో మరో మూడు పీఠాలు దక్కించుకుంది. కొల్లాపూర్, అయిజలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అధిక్యం కనబర్చినా.. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో ఈ రెండు మున్సిపాలిటీలు కూడా బీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. వడ్డేపల్లిలో కాంగ్రెస్, మక్తల్‌లో బీజేపీ గెలుపొందగా.. వడ్డేపల్లి చైర్మన్‌తో సహా మెజార్టీ కాంగ్రెస్ సభ్యులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కోస్గి, భూత్పూర్‌లో హంగ్ ఏర్పడగా ఈ రెండు మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్‌కు చెందిన వారే చైర్మన్లుగా ఎన్నికయ్యారు.
● అచ్చంపేటకు రెండోసారి, జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పాటైన పదేళ్ల తర్వాత 2021 ఏప్రిల్ 30 ఎన్నికల పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టారు. అచ్చంపేటలో 20 వార్డులకు గాను బీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 6, బీజేపీ 1 చొప్పున గెలుపొందారు. జడ్చర్లలో 27 వార్డులకు గాను బీఆర్‌ఎస్ 23, కాంగ్రెస్ 2, బీజేపీ 2 గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment