ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి రెగ్యులర్ ఈఓగా డిప్యూటీ కలెక్టర్ వి.సుబ్బారావును నియమిస్తూ దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్, ఆ శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఎట్టకేలకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి గత నెల 29న రాష్ట్రవ్యాప్తంగా 68 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీని ప్రకారం ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భూసేకరణ డైరెక్టర్‌గా పని చేస్తున్న వి.సుబ్బారావును ఏడాది పాటు డెప్యూటేషన్‌పై అన్నవరం దేవస్థానం ఈఓగా నియమించారు. ఇది జరిగిన రెండు వారాల అనంతరం ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు.
జాప్యంపై ఊహాగానాలు
దేవస్థానానికి పూర్తి స్థాయి ఈఓ నియామక ఉత్తర్వుల విడుదలలో జాప్యంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. గత నెల 29న చేసిన బదిలీల్లో భాగంగా శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం దేవస్థానాలకు డిప్యూటీ కలెక్టర్లను ఈఓలుగా నియమించారు. మిగిలిన రెండు దేవస్థానాల్లో ఈ నెల 4న నూతన ఈఓలు బాధ్యతలు స్వీకరించారు. అన్నవరం ఈఓగా నియమితులైన సుబ్బారావు అదే రోజు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆ రోజే ఆయనకు కూడా పోస్టింగ్ ఇవ్వాలి. కానీ, పోస్టింగ్ ఇవ్వడానికి ఎనిమిది రోజులు పట్టింది. ఆయన నియామకాన్ని నిలుపు చేయడానికి కొంత మంది తీవ్ర ప్రయత్నాలు చేశారని, అందువల్లనే జాప్యం జరుగుతోందనే ప్రచారం జరిగింది. సుబ్బారావు ముక్కుసూటిగా వ్యవహరించే అధికారి అని, నిజాయితీపరునిగా రెవెన్యూ శాఖలో పేరున్నందున, ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు విఫలయత్నం చేశారని అంటున్నారు.
దేవస్థానం పేరు తప్పుగా..
సుబ్బారావును ఈఓగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో ‘స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, అన్నవరం’ అని తప్పుగా పేర్కొన్నారు. తరువాత ఈ తప్పును సవరించి ‘శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అన్నవరం’గా మార్చారు.
రెగ్యులర్ ఈఓ లేక..
రెండు వారాలుగా రెగ్యులర్ ఈఓ లేక అన్నవరం దేవస్థానం పరిపాలనా వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంది. ఇన్‌చార్జి ఈఓగా ఏడాది కాలంగా పని చేసిన దేవదాయ, ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్‌ను గత నెల 25న ఈఓ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. అనంతరం ఇన్‌చార్జిగా సింహాచలం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావును నియమించారు. ఆయన హుండీల లెక్కింపు, వీఐపీల రాక, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడకు వచ్చారు. సింహాచలంలో కూడా కీలక విధులు నిర్వహిస్తూండటంతో ఆయనకు రెగ్యులర్‌గా వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇన్నాళ్లుగా పరిపాలనా వ్యవహారాలు స్తబ్దుగా సాగుతున్నాయి.
ఫ అన్నవరం దేవస్థానం
కొత్త ఈఓగా సుబ్బారావు
ఫ ఎట్టకేలకు దేవదాయ శాఖ
కమిషనర్ ఆదేశాలు
ఫ గత నెల 29నే ఉత్తర్వులు
ఫ అమలుకు రెండు వారాలు
రేపు నూతన ఈఓ బాధ్యతల స్వీకరణ
ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న సింహాచలం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు నుంచి నూతన ఈఓ సుబ్బారావు శనివారం సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ మేరకు దేవస్థానం పండితులు ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment