ఉత్తుత్తి హామీలతో కూటమి సర్కార్ దగా
● రైతు సమస్యలపై నిరంతరం పోరుబాట
● ‘అన్నదాతకు అండగా.. వైఎస్సార్ సీపీ’
ఆందోళనలో కురసాల కన్నబాబు
కాకినాడ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ‘నేతిబీరకాయ’ను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. కాకినాడలో శుక్రవారం నిర్వహించిన ‘అన్నదాతకు అండగా.. వైఎస్సార్ సీపీ’ కార్యక్రమానికి తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులనుద్దేశించి కలెక్టరేట్ వద్ద ఆయన ప్రసంగించారు. కూటమి అధికారం చేపట్టి ఆరు నెలలు గడచినా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నట్టేట ముంచేసిందని అన్నారు. ఖరీఫ్ దాదాపు పూర్తయ్యి, రబీ ప్రారంభమైనా ఇంత వరకూ పెట్టుబడి సాయం అందించలేదని, ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదని విమర్శించారు. పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని దయనీయ స్థితిలో రైతులున్నారని అన్నారు. కనీస మద్దతు ధర దక్కకపోగా ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ రైతులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూడా కూటమి ప్రభుత్వం మంగళం పాడేసిందన్నారు. తక్షణమే రైతుకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.20 వేలు, ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని, దళారీ వ్యవస్థను కట్టడి చేయాలని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తేమ లెక్కలతో రైతులను ఇబ్బందులకు గురి చేయరాదని, ఉచిత పంటల బీమా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కూటమి సర్కార్‌పై
గోతులు పూడ్చడానికి కూడా శంకుస్థాపనలు చేసి, ఫొటోలకు పోజులిస్తున్న తీరు చూస్తూంటే కూటమి ప్రభుత్వ ప్రచార వ్యామోహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని కన్నబాబు విమర్శించారు. సర్కార్‌పై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, తిరగబడే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. సూపర్–6 హామీలు అమలు చేయకపోగా తప్పుడు కేసులు, కక్ష సాధింపు చర్యలు, ప్రశ్నించే గొంతుకను అణచివేయడం తప్ప ఈ ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. సొంతంగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని ఫీట్లు చేసినా వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఏమాత్రం ఉపేక్షించబోమని, వారికి అండగా ఉద్యమిస్తామని చెప్పారు. ‘ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. వెనక్కు తగ్గేదే లేదు’ అని అన్నారు. చరిత్రలోనే తొలిసారిగా ఒక ఎస్‌ఈజెడ్‌లో రైతుల నుంచి తీసుకున్న భూముల్లో 2,180 ఎకరాలు వెనక్కి తిరిగి ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని, వాస్తవాలను వక్రీకరించి ఆయనపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు.
బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ
సూపర్–6 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ బాబు ష్యూరిటీ–బాదుడు గ్యారంటీ అన్నట్టుగా తయారైందని కన్నబాబు ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని, అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో పూర్తి చేయని నీరు–చెట్టు పథకానికి బిల్లులు చెల్లింపు మినహా ప్రజాప్రయోజన పథకాలేవీ అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.
మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వపు అనాలోచిత పనుల వల్ల ఏలేరు రిజర్వాయర్ రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయి దిక్కుతోచని స్థితికి రైతులు చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వం ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం రెండో పంటకు నీరందక అల్లాడుతున్నారన్నారు. ఏలేరు రిజర్వాయర్ పరిధిలో అనధికార నిర్మాణాలను, అక్రమ తవ్వకాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు యనమల కృష్ణుడు, గుబ్బల తులసి కుమార్, తోట రాంజీ, మురళీకృష్ణంరాజు, అల్లి రాజబాబు, గండేపల్లి బాబీ, వాసిరెడ్డి జమీలు, నాగం గంగబాబు, లాలం బాబ్జీ, ఒమ్మి రఘురామ్, ఆవాల లక్ష్మీనారాయణ, బెజవాడ సత్యనారాయణ, రావూరి వెంకటేశ్వరరావు, సుంకర శివప్రసన్న సాగర్, పొలసపల్లి సరోజ, జమ్మలమడక నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తున్న కన్నబాబు
Comments
Please login to add a commentAdd a comment