అన్నదాతకు అండగా..
●
● రైతు సమస్యలపై వైఎస్సార్ సీపీ ‘పోరుబాట’
● వైఎస్సార్ సీపీలో ఉరకలెత్తిన ఉత్సాహం
● కేసులకు తగ్గేదే లేదంటూ రోడ్డెక్కిన కేడర్
● కాకినాడలో కదం తొక్కిన రైతన్నలు
● జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ
● కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
● జేసీకి వినతి పత్రం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారంలోకి వచ్చి, ఆరు నెలలైనా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వంపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. సర్కార్ అనుసరిస్తున్న కప్పదాటు వైఖరి పిడికిలి బిగించారు. వైఎస్సార్ సీపీ జెండాయే అండగా.. ఆ పార్టీ శ్రేణులతో కలసి కాకినాడలో కదం తొక్కారు. రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే వీడాలని, ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
అన్నదాతలను నిట్టనిలువునా ముంచేసిన కూటమి సర్కార్ కళ్లు తెరిపించే లక్ష్యంతో.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ‘అన్నదాతకు అండగా.. వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం కాకినాడలో శుక్రవారం విజయవంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా దగా పడ్డ రైతన్నలు పార్టీలకతీతంగా కాకినాడకు పోటెత్తారు. వారికి సంఘీభావంగా జిల్లా నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. ఉదయం 10 గంటలకే జిల్లావ్యాప్తంగా రైతులు, పార్టీ నేతలు భారీ సంఖ్యలో స్థానిక జిల్లా పరిషత్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పార్టీ నేతలు వెంట రాగా.. కూటమి సర్కార్ రైతులను దగా చేసిన వైనాన్ని ఎండగడుతూ ప్లకార్డులు, ఫ్లెక్సీలతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు.
సర్కార్ తీరుపై ఆగ్రహం
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులు తడిసిన ధాన్యానికి సంబంధించిన వరి కంకులతో జెడ్పీ సెంటర్‌లో నిరసన తెలిపారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టపోతున్నామని, అయినప్పటికీ ప్రభుత్వం కనికరం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకూ ‘అన్నదాతా సుఖీభవ’ పేరిట రూ.20 వేలు ఇస్తామన్నారని, ఆరు నెలలైనా రూ.20 కూడా ఇవ్వలేదంటూ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక వైఎస్సార్ సీపీ శ్రేణులను, సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా పోలీసు కేసుల్లో ఇరికించి, వేధిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ శ్రేణులు ఏమాత్రం వెరవకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి పోటెత్తారు. తద్వారా పోలీసు కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. దీంతో కలెక్టరేట్ జన ప్రభంజనాన్ని తలపించింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. పోలీసు కేసులతో వెనకడుగు వేసేదే లేదనే విషయం భారీగా తరలివచ్చిన శ్రేణులతో స్పష్టమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తన ప్రసంగంలో చెప్పడం కార్యకర్తల్లో మరింత మనోధైధైర్యాన్ని నింపింది.
అడ్డుకున్న పోలీసులు
రైతు సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలు తక్షణం అమలు చేయాలని కోరుతూ అధికారులకు విజ్ఞాపన అందజేసేందుకు రైతులతో కలసి కలెక్టరేట్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దనే నిలిపివేశారు. దీనిపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగివచ్చిన పోలీసులు.. చివరకు పరిమిత సంఖ్యలో నేతలను అనుమతించారు. నేతలు, రైతులు వెంట రాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యాన మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నాగులాపల్లి ధనలక్ష్మి, కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేశారు. కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకూ దశల వారీ ఆందోళనలు చేసేందుకు వెనుకాడేది లేదని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఖరీఫ్‌లో పావలా సాయం అందలేదు
నేను ఏడెకరాలు సాగు చేస్తున్నాను. గత జగన్ ప్రభుత్వంలో అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే సొమ్ము వేయడంతో పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా ఉండేది. రైతులకు అండగా ఉంటానని ఎన్నికల్లో చెప్పి, అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని మరచిపోయింది. పావలా కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. రైతులు అప్పుల పాలవుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
– దువ్వా సత్తిబాబు,
తమ్మవరం, కాకినాడ రూరల్ మండలం
Comments
Please login to add a commentAdd a comment