పులీ.. ఉన్నావా.. దారి మళ్లావా..!
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ఉలిగోగుల రిజర్వు ఫారెస్టు పరిధిలోని బాపన్నధార లొద్దులో పెద్దపులి అలజడి సృష్టించి ఐదు రోజులవుతోంది. అటవీ అధికారులకు ఇప్పటి వరకూ దాని జాడ ఎక్కడా లభించలేదు. దాని ఆచూకీ కోసం అటవీ అధికారులు, సిబ్బంది ఉలిగోగుల రిజర్వు ఫారెస్టు పరిధిలోని బాపన్నధార, కొండపల్లి, బురదకోట, దారపల్లి తదితర గ్రామాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆరు ట్రాప్ కెమెరాలు అమర్చగా.. ఏ ఒక్క కెమెరాకు పులి చిక్కలేదు. దీంతో పులి ఉలిగోగుల రిజర్వు ఫారెస్టులో ఉందా లేక అక్కడి నుంచి దారి మళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ధారపల్లి జలపాత మార్గం మూసివేత
పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో రక్షణ చర్యల్లో భాగంగా ధారపల్లి జలపాతం మార్గాన్ని అధికారులు మూసివేశారు. తాము మళ్లీ ప్రకటించేంత వరకూ ఎవరూ ధారపల్లి ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. బురదకోట గిరిజన గ్రామానికి సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో పెద్ద పులి ఉండే అవకాశం ఉండటంతో బాపన్నధార, కొండపల్లి, ధారపల్లి, బురదకోట గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ దిగువన బవురువాక, పాండవులపాలెం, తాడువాయి తదితర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, అత్యవసర పనులు ఉంటే మినహా రాత్రి వేళల్లో బయటకు రావద్దని సూచించారు. పశువులు, మేకలు, గొర్రెలను పొలాల్లో ఉంచవద్దని హెచ్చరించారు.
15న ఆత్మార్పణ దినం
కాకినాడ సిటీ: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఈ నెల 15న ఆత్మార్పణ దినంగా పాటించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.
15న జిల్లా జూనియర్
కబడ్డీ జట్ల ఎంపిక
సామర్లకోట: జిల్లా బాలుర, బాలికల జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక ఈ నెల 15వ తేదీ ఆదివారం జరుగుతుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. కాకినాడ పీఆర్ కళాశాల క్రీడా మైదానం, ఇండోర్ కోర్టు మ్యాట్‌పై ఈ ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు. 2005 జనవరి 12 తరువాత పుట్టిన 70 కేజీల్లోపు బాలురు, 65 కేజీల్లోపు బాలికలు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని వివరించారు. మ్యాట్ షూస్ తప్పనిసరిగా తీసుకు రావాలన్నారు. వివరాలకు 94911 01109, 99921 66997 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో
సమస్యలు పరిష్కరించాలి
కాకినాడ సిటీ: అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధి కారి కె.ప్రవీణకు గురువారం వినతిపత్రం అందజేశారు. హెల్పర్లకు ప్రమోషన్లు, రిటైరైన వారికి బెనిఫిట్లు ఇవ్వాలని కోరారు. కొంత మంది ఆయాలు, టీచర్లకు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూరగాయల బిల్లు పెంచాలని, కాకినాడ అర్బన్‌లో రవాణా చార్జీలు ఇవ్వాలని, సామర్లకోట, కాకినాడ రూరల్, కరప, గొల్లప్రోలు, జగ్గంపేట తదితర మండలాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తొలగించాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కరిస్తామని, తమ పరిధిలో లేనివి కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పీడీ ప్రవీణ హామీ ఇచ్చారని అంగన్‌వాడీ నాయకులు తెలిపారు. పీడీని కలిసిన వారిలో డి.పద్మావతి, ఎరుబండి చంద్రావతి, నీరజ, విజయ, ఎస్తేరురాణి, ధనలక్ష్మి, వీరవేణి, తులసి తదితరులున్నారు.
పీడీ ప్రవీణకు వినతి పత్రం
అందజేస్తున్న అంగన్‌వాడీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment