మెట్లోత్సవంపై గందరగోళం
అన్నవరం : ఏటా ధనుర్మాస ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజు సత్యదేవుని మెట్లోత్సవం నిర్వహిస్తూంటారు. అయితే, ఈసారి ఈ ఉత్సవం నిర్వహణపై కొంత గందరగోళం నెలకొంది. అన్నవరం దేవస్థానం పంచాంగంలో ఈ నెల 16వ తేదీ సోమవారం మెట్లోత్సవం, ధనుర్మాస ఉత్సవాల ప్రారంభం అని ఉంది. అయితే మెట్లోత్సవాన్ని ఈ నెల 15వ తేదీ ఆదివారమే నిర్వహించనున్నట్లు అన్నవరం దేవస్థానం అధికారులు తెలిపారు. దీంతో ఏ తేదీ సరైనదనే అంశంపై దేవస్థానంలో చర్చ జరుగుతోంది. దేవస్థానం పంచాంగాన్ని తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి రూపొందించారు. ఆయనకు తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ సహకరించారని ఆ పంచాంగంలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పంచాంగం రాతప్రతిని ప్రతి ఉగాదికి మూడు నెలల ముందుగానే పంచాంగకర్తలు దేవస్థానం పండితులకు అందజేస్తారు. దానిని దేవస్థానం వైదిక కమిటీ పరిష్కరించి, తప్పులను సవరించి తిరిగి పంచాంగకర్తలకు పంపిస్తారు. అనంతరం దానిని ముద్రించి, ఉగాది నాడు దేవస్థానంలో పూజలు చేసి, పంపిణీ చేస్తారు. అయితే పంచాంగకర్తల గణన లోపమో లేక దేవస్థానం పండితులు సరిగా పరిశీలించకపోవడమో కానీ మెట్లోత్సవానికి పంచాంగంలో పేర్కొన్నది ఒక తేదీ అయితే దేవస్థానం నిర్వహిస్తున్నది మరో తేదీగా ఉంది.
చురుకుగా ఏర్పాట్లు
మెట్లోత్సవం సందర్భంగా రత్నగిరి దిగువన తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న 450 మెట్లకు భక్తులతో పూజలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారు. రత్నగిరి మెట్ల మార్గంలో ప్రతి మెట్టునూ రంగులు వేసి, ముస్తాబు చేశారు. తొలి పావంచా వద్ద ఉన్న సత్యదేవుని పాదాల మండపం వద్ద ప్రత్యేకంగా అలంకరించనున్నారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలుత రత్నగిరి నుంచి కొండ దిగువకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకు వచ్చి, గ్రామంలో పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం తొలి పావంచా వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత తొలి పావంచా వద్ద పూజలు చేసి, మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి స్వామివారి ఆలయం వరకూ ఉన్న మెట్లకు భక్తులు పూజలు చేసి, హారతి ఇస్తారు. ఆ మెట్ల మీద నుంచి స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్తారు. ఇదిలా ఉండగా ధనుర్మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి సంక్రాంతి వరకూ అంటే జనవరి 14వ తేదీ వరకూ సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారిని ప్రతి రోజూ ఉదయం ఏడు గంటల నుంచి అన్నవరం వీధుల్లో పల్లకీ మీద ఘనంగా ఊరేగిస్తారు.
అచ్చు తప్పే..
ధనుర్మాసం 16వ తేదీన ప్రారంభమవుతోంది. దానికి ఒక రోజు ముందు అంటే 15వ తేదీన మెట్లోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పంచాంగంలో రెండూ ఒకే రోజు నిర్వహిస్తున్నట్లుగా అచ్చు తప్పు పడింది.
– గొల్లపల్లి గణపతి ఘనపాఠి, దేవస్థానం వేద పండితుడు
ఫ 16న జరపాలన్న
అన్నవరం దేవస్థానం పంచాంగం
ఫ 15నే నిర్వహించేందుకు
అధికారుల ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment