తీగ లాగితే డొంక కదిలింది
అమలాపురం టౌన్: ఓ ఫిర్యాదు ఆధారంగా తీగ లాగితే డొంకే కదలింది.. దొంగ నోట్ల ముద్రణలో ఆరితేరిన ముఠా చివరికి పోలీసులకు చిక్కింది. ముఠాలోని 12 మంది నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు, రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్‌తో కలసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. దొంగ నోట్ల ముఠాలో సభ్యులైన రాజోలు మండలం తాటిపాకకు చెందిన పాస్టర్ కొల్లా వీరవెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన సత్తి వీర రాఘవరెడ్డి, కడియం మండలం వేమగిరికి చెందిన తుంపర దుర్గాప్రసాద్, ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన పాశర్లపూడి వెంకట సత్యనారాయణ, రాయవరం మండలం వెంటూరుకు చెందిన పట్టపగలు మారయ్య, రామచంద్రపురానికి చెందిన ఉత్తరాల హరి అప్పారావు, మాగంటి గోపి, కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన షేక్ మస్తాన్, అదే జిల్లా వీరవల్లికి చెందిన షేక్ హనిఫ్, కపిలేశ్వరపురం మండలం రామాపురానికి చెందిన బొక్కా శ్రీనివాస్, తాళ్లరేవు మండలం బొడ్డువెంకటయ్య పాలేనికి చెందిన మేదా పోసారావు, కాకినాడ జిల్లా పెదపూడికి చెందిన చింతా వీరన్నలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ముఠా నుంచి రూ.1.33 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, ఆ నోట్ల తయారీకి ఉపయోగించే 12 రకాల యంత్రాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కృష్ణా జిల్లాతో పాటు పలు జిల్లాలో దొంగ నోట్ల మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎలా బయట పడిందంటే..
గత నెల 30న రాజోలులోని ఓ ఏటీఎంలో తాటిపాకకు చెందిన పాస్టర్ కొల్లా వీరవెంకట సత్యనారాయణ రూ.50 వేలను డిపాజిట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే సత్యనారాయణ డిపాజిట్ చేసిన రూ.వంద, రూ.500 నోట్లు నకిలీవి కావడంతో ఏటీఎం ఆ ప్రొసెస్‌కు అంగీకరించలేదు. దీంతో అనుమానం వచ్చిన రాజోలు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజోలు సీఐ నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై బి.రాజేష్‌కుమార్ దీనిపై లోతుగా దర్యాప్తు చేశారు. సత్యనారాయణ దొంగ నోట్లను ఏటీఎంలో వేయడం, అవి యాక్సస్ కాకపోవడం వెనుక ఓ ముఠా ఉన్నట్లు గుర్తించారు. అనపర్తికి చెందిన వీర రాఘవరెడ్డి, పాస్టర్ సత్యనారాయణ కలసి దొంగ నోట్ల చలామణికి చర్చించుకున్నట్లు గుర్తించారు. వీర రాఘవరెడ్డి మారయ్య, గోపిలను సత్యనారాయణకు పరిచయం చేయడం తెలుసుకున్నారు. వారు ఏజెంట్ల ద్వారా దొంగ నోట్లను ప్రింట్ చేసి సరఫరా చేయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరవల్లి ప్రాంతంలో షేక్ మస్తాన్ ఏఎంఎస్ ఎంటర్‌ప్రైజెస్ నడుపుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ముఠాలోని 12 మంది ఓ బలమైన నెట్‌వర్క్ ద్వారా దొంగ నోట్లను ముద్రించి చలామణి చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో గమనించారు. ఈ కేసు దర్యాప్తులో శ్రమించిన రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్‌ను ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందించారు. రాజోలు సీఐ నరేష్‌కుమార్, క్రైమ్ సీఐ ప్రశాంత్‌కుమార్‌లను అభినందించారు. క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు కె.వెంకటరమణ, ఎం.రమేష్, కానిస్టేబుళ్లు హుస్సేన్, నవీన్, అలీ, పూజలకు కూడా ఎస్పీ రివార్డులు అందించారు.
ఫ దొంగ నోట్ల ముఠా అరెస్ట్
ఫ రూ.1.33 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం
ఫ 12 యంత్రాలు, పరికరాల సీజ్
Comments
Please login to add a commentAdd a comment