ముందు రెక్కీ.. తర్వాత చోరీ | - | Sakshi
Sakshi News home page

ముందు రెక్కీ.. తర్వాత చోరీ

Published Sat, Dec 14 2024 3:34 AM | Last Updated on Sat, Dec 14 2024 3:34 AM

ముందు రెక్కీ.. తర్వాత చోరీ

ముందు రెక్కీ.. తర్వాత చోరీ

అమలాపురం టౌన్‌: ఆ దొంగల ముఠా ముందు రెక్కీ నిర్వహిస్తుంది. తర్వాత చోరీలు చేస్తుంది. పలు జిల్లాల్లో 13 చోరీలకు పాల్పడ్డ ఈ ముఠాలోని ముగ్గురిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఆత్రేయపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన పలు చోరీలకు సంబంధించి ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.24 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీల వివరాలను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు, రావులపాలెం సీఐ విద్యాసాగర్‌, సీసీఎస్‌ క్రైమ్‌ పార్టీ ఇన్‌చార్జి సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌తో కలసి వివరించారు. ముఠాలోని నిందితులైన అమలాపురం రూరల్‌ మండలం చిందాడగరువుకు చెందిన మండేల నాగ భాస్కరరావు, ఐ.పోలవరం మండలం మురమళ్ల శివారు కొత్త కాలనీకి చెందిన బొడ్డు కిషోర్‌, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ముత్యాలపల్లి పెద్దిరాజును అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ.24 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద శుక్రవా రం మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా ఆత్రేయపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 3 చోరీలు, ఆలమూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, అంబాజీపేట, అంగర, అమలాపురం పట్టణం, సఖినేటిపల్లి, కొత్తపేట, పి.గన్నవరం పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క చోరీకి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక చోరీ, కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక చోరీకి పాల్పడింది. వీరి నుంచి 311 గ్రాముల బంగారు నగలు, 3.200 కిలోల వెండి వస్తువులు మొత్తం రూ.24 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుడైన ముత్యాలపల్లి పెద్దిరాజు సస్పెండ్‌కు గురైన వీఆర్వో. ఇతను గత సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దొంగ నోట్ల చలామణి కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. మరో ముఠా సభ్యుడు మండేల నాగ భాస్కరావు చెడు వ్యసనాల బాట పట్టి చోరీల చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతనిపై కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా 40కి పైగా ఇంటి దొంగతనాల కేసులు ఉన్నాయి. ఇంకో నిందితుడు బొడ్డు కిషోర్‌పై అమ్మాయి కిడ్నాప్‌ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. అంతర జిల్లాల దొంగల ముఠాను చాకచక్యంగా అరెస్ట్‌ చేసి రూ.24 లక్షల సొత్తును రికవరీ చేసిన ఆత్రేయపురం ఎస్సై రాము, సీసీఎస్‌ క్రైమ్‌ పార్టీ ఇన్‌చార్జి సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌లను ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు.

ఫ అంతర జిల్లాల దొంగల ముఠా అరెస్ట్‌

ఫ రూ.24 లక్షల సొత్తు స్వాధీనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement