నేడు జాతీయ లోక్ అదాలత్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో శనివారం ఉదయం 10 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ గంధం సునీత తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ తగాదాలు, ప్రమాద, బ్యాంకు, రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరిస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం 6, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, రంపచోడవరం అడ్డతీగలలో జాతీయ లోక్ అదాలత్‌లు జరుగుతాయన్నారు.
లారీల యజమానులకు ఫైన్
కొవ్వూరు: ఇసుక సామర్థ్యానికి మించి లోడింగ్ చేసుకుని వెళ్తున్న ఐదు లారీలను టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఏరినమ్మ ర్యాంపు నుంచి నాలుగు, వాడపల్లి ర్యాంపు నుంచి ఒక లారీ అదనపు లోడుతో వెళుతున్నట్లు గుర్తించామని ఏఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. వాడపల్లి ర్యాంపులో పట్టుబడిన లారీలో 11 టన్నులకు అదనంగా ఇసుక ఉన్నట్లు ఏఎస్సై తెలిపారు. ఈ లారీ నుంచి రూ.22,912 అపరాధ రుసుం కింద వసూలు చేశామన్నారు. ఏరినమ్మ ర్యాంపులో దొరికిన నాలుగు లారీలు ఒక్కో లారీ ఆరు టన్నుల పైబడి అదనపు లోడు ఉందన్నారు. వీటి యజమానుల నుంచి అపరాధ రుసుం వసూలు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్సై జి.పరమేష్ తెలిపారు. మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
యూత్ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో వచ్చే ఏడాది జరగనున్న యూత్ ఫెస్ట్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎన్.సతీష్‌రెడ్డి తెలిపారు. జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను క్యాంపస్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ఎంబీ శ్రీనివాసరావు, ఎస్.రమాశ్రీ, జి.సురేష్, ప్రిన్సిపాల్స్ ఎ.రమేష్, కె.రవిశంకర్, డి.సతీష్ కుమార్, విశాల్ చవాన్, ఎస్టీవీఎస్ కుమార్, ఎ.విజయ భార్గవి, డీన్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment