కొవ్వూరు: గోదావరి నదిలో రోడ్డు కం రైలు వంతెనకు కేవలం మూడు వందల మీటర్ల లోపు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తున్న రెండు బోట్లను సీజ్ చేసినట్లు అఖండ గోదావరి రివర్ బ్యాంక్ (ఏజీఆర్‌బీ) ఏఈ జి.మణికంఠరాజు తెలిపారు. ఈ బోట్లు ఏరినమ్మ ఘాట్‌లో తైలం అశోక్‌కు చెందినవిగా గుర్తించామన్నారు. వీటిని స్థానిక గోష్పాద క్షేత్రంలో బోట్ పాయింట్‌కు తరలించామన్నారు. రోడ్డు కం రైలు వంతెన, ఇతర వంతెనలకు ఐదు వందల మీటర్ల లోపు ఏవిధమైన తవ్వకాలు చేపట్టరాదన్నారు. గతంలో ఔరంగాబాద్, ఏరినమ్మ ర్యాంపులకు చెందిన 12 ఇసుక బోట్లను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అధికారులు అప్పట్లో బోట్స్ సీజ్ చేయడంతో పాటు యాజమానులపై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడకపోవడం విమర్శలకు తావిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జాము వరకు వంతెనలకు సమీపంలోనే ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. అధికారులు మాత్రం అడపాదడపా దాడులు చేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment