గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు | - | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు

Published Thu, Jan 2 2025 12:32 AM | Last Updated on Thu, Jan 2 2025 12:32 AM

గత ప్

గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు

రైతులను ఆదుకోవాలి

అధికారంలోకి వస్తే రైతులకు ఎంతో మేలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా అన్నదాతల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు సాయం పొందారు. ఇప్పుడు వాటిని నిర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుండడంతో ఎరువుల, విత్తనాల కొరత ఏర్పడింది. రబీ మొదలైనా అన్నదాత సుఖీభవ పథకం కింద అందజేస్తామన్న రూ.20 వేలు నగదు సాయం ఊసే ఎత్తడం లేదు. గతంలో పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించగా, ఇప్పుడు రైతులే చెల్లిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా గతంలో అందించిన సేవలను కొనసాగించాలి. పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలి.

– రాయుడు శ్రీనివాస్‌,

రైతు, యండమూరు, కరప మండలం

దగా చేయడం తగదు

ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు సాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం రైతులను దగా చేయడమే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక రైతు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి రైతులను అన్నీ విధాలా ఆదుకున్నారు. రైతు భరోసా పథకం కింద ఏటా పెట్టుబడి సాయాన్ని అందజేసింది. ఆ ఐదేళ్లు రైతులు ఎంతో సంతోషంగా సాగు చేపట్టారు. ఇప్పుడు ప్రభుత్వం సాయం అందక సన్నకారు రైతులు రబీ సాగుకు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

– వి.సీతారామరాఘవ,

విజయరాయుడుపాలెం, కరప మండలం

కాకినాడ సిటీ: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలు అందిస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థకు మంగళం పాడేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. జిల్లాలో మెట్ట ప్రాంత మండలాలతో పాటు మిగతా మండలాల్లోనూ ఇకపై రైతులకు అందే సేవలు నిలిచిపోనున్నాయి. వరి ఈ–క్రాప్‌ ఆధారంగా రేషనలైజేషన్‌ పేరుతో వీఏఏ (విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌)లను బదిలీ చేయడంతో చాలాచోట్ల ఆర్బీకేలు శాశ్వతంగా మూతపడనున్నాయి. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామస్థాయిలోనే ఆర్బీకే వ్యవస్థను రూపొందించారు. ఊరు దాటకుండానే వ్యవసాయశాఖ సేవలను రైతులు పొందారు. ఇప్పుడు ఆ వ్యవస్థను దశల వారీగా నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్బీకేల్లో రైతులకు ఉపయోగపడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర సేవలకు మంగళం పాడేశారు. కేవలం పేరుకే రైతు భరోసా కేంద్రాలు అన్నట్లు గ్రామాల్లో కన్పిస్తున్నాయి తప్ప రైతులకు ఉపయోగపడే ఏ సేవలూ కొనసాగడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రిక, రైతుల ఆత్మబంధువైన ఆర్బీకే వ్యవస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ వ్యవస్థను ఆది నుంచీ వ్యతిరేకించిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ప్రాధాన్యం తగ్గించి వైఎస్‌ జగన్‌ ముద్రను చెరిపేసే కుట్ర చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆర్బీకేలను అదృశ్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే వీఏఏలను రేషనలైజేషన్‌ పేరుతో బదిలీ చేశారంటున్నారు.

ఇప్పటికే మెట్ట ప్రాంతాలకు తీవ్ర అన్యాయం

మెట్ట మండలాల్లో ముఖ్యంగా మినుము, పెసర, మొక్కజొన్న, మిరప, జొన్న, పొద్దు తిరుగుడు, పసుపు, వేరుశనగ, పొగాకు, సజ్జ, పత్తితో పాటు మామిడి, బత్తాయి, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు కూడా సాగు చేస్తారు. ఈ రైతుల సౌకర్యార్థం జిల్లాలో 414 మంది వీఏఏలతో రైతు భరోసా కేంద్రాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ స్థాయిలో రైతులకు సేవలు అందజేసింది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో సేవలు లేకపోవడంతో ఇటు మెట్ట, అటు డెల్టా ప్రాంతాల రైతులు గగ్గోలు పెడుతున్నారు.

సుఖీభవ కోసం నిరీక్షణ

కూటమి ప్రభుత్వం రబీ సీజన్‌లోనైనా అన్నదాతా సుఖీభవ పథకం కింద నగదు సాయం అందజేస్తుందని రైతులు ఆశించారు. అయితే ఆ ఊసే ఎత్తకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు అప్పులు చేసి మరీ వరి నాట్లు వేసుకుంటున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏటా అర్హులైన రైతులకు రూ. 13,500 చొప్పున నగదు సాయం అందజేసి ఆదుకుంది. గత ఐదేళ్లలో కాకినాడ జిల్లాలో 1.75 లక్షల మంది రైతులకు రూ.1.675 కోట్ల మేర పెట్టుబడి సాయం అందింది. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి నాయకులు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు సాయం అందజేస్తామని రైతులకు చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. ఖరీఫ్‌ సీజన్‌లో అందజేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రస్తుత రబీ సీజన్‌లోనూ ప్రభుత్వం ఆ ఊసెత్తకపోవడంతో రైతులు బ్యాంకుల్లోనూ, బయట అప్పులు చేసి సాగు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

వ్యవసాయం దండగ అని ప్రగాఢంగా నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ రంగానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల వేళ రైతులను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో హామీలు ఇవ్వడం.. ఆనక అటకెక్కించడం ఆయనకు పరిపాటి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోయే ఇప్పటికే పొందుతున్న సదుపాయాలను, రాయితీలను దూరం చేస్తుండడం రైతులను ఇబ్బందుల పాలు చేస్తోంది. అన్నదాతా సుఖీభవ ఊసెత్త కుండా, ఉచిత పంటల బీమాకు మంగళం పాడిన ఆయన తాజాగా ఆర్బీకేలను మూతవేసే దిశగా వేస్తున్న అడుగులు సాగును సంక్షోభంలోకి నెడుతున్నాయి.

ఆర్బీకే వ్యవస్థకు మంగళం

పాడనున్న కూటమి సర్కారు

ఇప్పటికే గ్రామాల్లో

సేవలు బంద్‌ చేసిన వైనం

జిల్లాలో 414 రైతు భరోసా

కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర

విత్తనాలు, ఎరువులు, పురుగు

మందులు అందక రైతులకు ఇక్కట్లు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సేవలను ఇంటి ముంగిటే అందించే లక్ష్యతో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చింది. అందులో భాగంగా కాకినాడ జిల్లాలో 414 ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. అందులో దాదాపుగా 278కి పైగా ఆర్‌బీకేలకు సొంతభవనాలుండగా మరికొన్ని కేంద్రాలను అద్దె భవనాల్లో ఏర్పాటు చేసింది. ఇంకొన్ని భవనాలు పలు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కొక్క ఆర్బీకే నిర్మాణానికి రూ.23.94 లక్షల వంతున ఖర్చు చేసింది. రైతులకు సేవలు అందించేందుకు ఆర్బీకేల్లో ప్రత్యేక వ్యవసాయ అసిస్టెంట్‌లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా ఏటా రబీ సీజన్‌లో 6 వేలు, ఖరీఫ్‌ సీజన్‌లో4 వేల క్వింటాళ్లకు పైగా నాణ్యమైన విత్తనాలను రైతులకు ప్రభుత్వం రాయితీపై అందజేసింది. అకాల వర్షాలతో నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు 80 శాతం సబ్సిడీపై మళ్లీ విత్తనాలను సైతం పంపిణీ చేసింది. ఏటా సుమారు రెండు వేల టన్నులకు పైగా ఎరువులను ఇంటి ముంగిటకే అందజేసింది. పంట నూర్పిళ్ల సమయంలో ఏటా 2.75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు కనీస మద్దతు ధర అందించింది. ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా ఆర్బీకే సిబ్బంది ముందస్తుగా ఈ–క్రాప్‌ ద్వారా వివరాలు నమోదు చేసేవారు. ఏటా సుమారు 30 వేల మంది రైతుల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేయడం ద్వారా మెరుగైన సేవలు అందించింది. ఆర్బీకేల ద్వారా రైతు భరోసా, పీఎం కిసాన్‌, పొలంబడి, రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ, పంటల బీమా, తదితర సుమారు 20 రకాల సేవలు అందేవి. భూసార పరీక్షలు సైతం నిర్వహించి శాసీ్త్రయ పద్ధతిలో నేల స్వభావాన్ని, సూక్ష్మ, స్థూల పోషకాలను అంచనా వేసి రైతులకు.. ఏ మేర ఎరువులు వేయాలి. ఏఏ పంటలు సాగు చేయాలి వంటి సూచనలు, సలహాలను సైతం అందజేసింది. తద్వారా రైతుల పెట్టుబడులు గణనీయంగా ఆదా అయ్యాయి. ఆర్బీకేల ద్వారా పంటల బీమా కూడా రైతులకు సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఆర్బీకేల్లో ఉన్న రైతుల వివరాల ఆధారంగా సిబ్బంది ఉచిత పంటల బీమా చేయించడంతో పాటు ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం సైతం అందేది. జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో చెరువులు, బోర్లు కింద వరి సాగు చేస్తారు. మొత్తం మీద ఏదో ఒక పంట అయితే రైతులు సాగు చేస్తారు. పంట సాగును పర్యవేక్షించేందుకు వీఏఏలు క్షేత్ర స్థాయిలో పర్యటించి చీడపీడలు, తెగుళ్ల నివారణకు రైతులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా మార్చిన కూటమి ప్రభుత్వం ఎరువుల పంపిణీని నిలిపివేసింది. విత్తనాలను అరకొరగా పంపిణీ చేస్తోంది. ఉచిత పంటల బీమాను సైతం నిలిపివేసింది. దీంతో రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు 1
1/3

గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు

గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు 2
2/3

గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు

గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు 3
3/3

గత ప్రభుత్వంలో 20 రకాల సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement