సత్యదేవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి బుధవారం వేలసంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామివారి ఆలయానికి భక్తుల రాక మొదలైంది. సాయంత్రం వరకు ఇది కొనసాగింది. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజనం పెట్టారు.
ఎస్పీకి పదోన్నతి
కాకినాడ క్రైం: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు పదోన్నతి లభించింది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఎస్‌పీ)గా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2012 బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్ విజయనగరం జిల్లాలో ఆపరేషన్స్ అదనపు ఎస్‌పీగా, చిత్తూరు ఎస్‌పీగా, గుంతకల్ రైల్వేస్ ఎస్‌పీగా, విజయవాడ డీసీగా, విజయనగరం ఐదవ బెటాలియన్ ఏపీఎస్‌పీ కమాండెంట్‌గా, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్‌పీగా పనిచేశారు. అక్కడి నుంచి గత ఏడాది జూలై 17వ తేదీన కాకినాడ జిల్లా ఎస్‌పీగా బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు.
కిక్కిరిసిన అయినవిల్లి
అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి పంచామృత అభిషేకాల్లో నలుగురు, లఘున్యాస అభిషేకాల్లో 145 మంది, పరోక్ష అభిషేకాల్లో ఇద్దరు, స్వామివారి గరిక పూజలో ముగ్గురు, ఉండ్రాళ్ల పూజలో ఒకరు, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 27 మంది పాల్గొన్నారు. ఒక చిన్నారికి అక్షరాభ్యాసం, ఐదుగురు చిన్నారులకు అన్నప్రాసన, ఆరుగురికి తులాభారం చేశారు. 74 మంది భక్తులు వాహన పూజ చేయించుకోగా, స్వామివారి అన్నప్రసాదం 6,598 మంది భక్తులు స్వీకరించారు. ఈ ఒక్కరోజే రూ.4,49,861 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, ఏసీ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
వీరేశ్వరుని సన్నిధిలో
శుభలేఖలకు పూజలు
ఐ.పోలవరం: మురమళ్లలో కొలువైన శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు పంపిన శుభలేఖలను స్వామి, అమ్మవార్ల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఆలయంలో స్వామివారికి కల్యాణం జరుగుతోంది. ముఖ్యంగా పెళ్లికాని యువతీ యువకులు ఇక్కడ స్వామివారికి కల్యాణం జరిపిస్తే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో భక్తులు పోస్ట్‌ద్వారా పంపిన శుభలేఖలను స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
జోన్ 2 లో స్టాఫ్ నర్స్‌ల
పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య, ఆరోగ్యశాఖ జోన్ 2 పరిధిలో స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ఆర్‌జేడీ పద్మశశిధర్ బుధవారం తెలిపారు. జోన్ 2 పరిధి పూర్వపు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తులను రాజమహేంద్రవరంలోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు సీడబ్ల్యూ.ఏపీ.నిక్.ఇన్ వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment