అదిరే.. కళ్లు చెదిరే
●
● అమలాపురంలో రేపు జాతీయ చిత్రకళా ప్రదర్శన
● దేశ వ్యాప్తంగా 500 మంది చిత్రకారుల రాక
● 215 మందిని సత్కరించనున్న నిర్వాహకులు
అమలాపురం టౌన్: చిత్రం... అపురూపం. చిత్రకారుడు తన కుంచెతో గీసే చిత్రాన్ని మనసు పెట్టి అంతర్గతంగా అన్వేషిస్తే శత కోటి భావాలు కనిపిస్తాయి. ఆ కళను ఆస్వాదించే మనసు ఉండాలే గాని ఆ చిత్రంలోని భావాలు చిత్రకళా ప్రియులకు ఇట్టే అర్థమవుతాయి. ప్రతి చిత్రం ఓ అద్భుతమే.. తన కుంచే ఓ అపురూప చిత్రాన్ని ఆవిష్కరించేలా ఆ చిత్రకారుడు తన భావాలను అందులో నిక్షిప్తం చేస్తాడు. కోనసీమ చిత్రకళా పరిషత్ 35 ఏళ్లుగా అమలాపురం వేదికగా ఏటా నిర్వహించే జాతీయ చిత్ర కళా పోటీలు, ప్రదర్శనల్లో అలాంటి భావ గర్భిత చిత్రాలెన్నో ఆవిష్కృతమవుతాయి. ఈ ప్రదర్శనల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేయి తిరిగిన చిత్రకారులు పాల్గొని అద్భుత చిత్రాలను గీసి ఔరా అనిపిస్తారు. అమలాపురం శ్రీసత్యసాయి కల్యాణ మండపంలో ఈ నెల 19న ఈ అపురూప చిత్రాలు కొలువు దీరుతాయి. కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి, ప్రముఖ చిత్రకారుడు కొరసాల సీతారామస్వామి చిత్ర లోకానికి అంకితమై జాతీయ పోటీలనే కాదు, జాతీయ స్థాయి ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ చిత్ర కళను తన వంతు జీవింపజేస్తున్నారు. ఈ ఏడాది జాతీయ పోటీలకు దేశ వ్యాప్తంగా 850 మంది చిత్రకారుల నుంచి చిత్రాలు వచ్చాయి. అందులో 250 మందిని ఎంపిక చేసి అమలాపురంలో జరగనున్న చిత్రకళా బ్రహ్మోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకూ నగదు బహుమతులతో పాటు వివిధ కేటగిరీలైన గోల్డెన్, మెగా, బెస్ట్ గోల్డెన్ పద్మ అవార్డులతోపాటు బ్రహ్మోత్సవ అవార్డులతో విజేతలను సత్కరించనున్నారు. ఈ చిత్ర కళా ప్రదర్శనలో దాదాపు 500 మంది చిత్రాలు ప్రదర్శించనున్నారు. సుమారు 500 మంది చిత్రకారులు అమలాపురానికి రానున్నారు. దేశంలోని ప్రముఖ చిత్రకారులైన బాపు, వడ్డాది పాపయ్య, నీలి వెంకటరమణ, డిజిటల్ రవి తదితర చిత్రకారుల గీసిన చిత్రాలు కూడా ప్రదర్శితం కానున్నాయి. ఇదే సందర్భంగా పరిషత్ ప్రతినిధి సీతారామస్వామి 215 మంది ప్రముఖ చిత్రకారులతో ముద్రించిన ‘అవర్ ఆర్టిస్ట్స్ బోరన్ టు ఎక్సెల్’ పేరుతో ఉన్న చిత్ర సౌందర్య లహరి పుస్తకాన్ని ప్రదర్శించమే కాకుండా అందులోని చిత్రకారులను కూడా సత్కరిస్తారు. ఈ పోటీలకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖాండ్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు తమ చిత్ర నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తాము గీసిన చిత్రాలను పంపించారు. జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో చిత్రకళా బ్రహ్మోత్సవాన్ని నిర్వహించనున్నారు.
నా చిత్ర కళా ప్రస్థానం నిండు నూరేళ్లూ సాగాలి
నేను జీవించి ఉన్నా, లేకపోయినా నా శిష్యులు మాత్రం ఈ చిత్ర కళా పోటీలు, ప్రదర్శనలను కొనసాగిస్తారు. ఇప్పుడు తమ పరిషత్ ఆధ్వర్యంలో 35వ జాతీయ చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నాం. తమ శిష్యులు 100వ చిత్ర కళా ప్రదర్శన నిర్వహించాలన్నదే తన కళా తపన. దేశంలో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా నేను 35 ఏళ్లుగా జాతీయ స్థాయి చిత్ర కళా పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ దేశంలో ఎందరో చిత్రకారులకు చేయూత ఇచ్చాను. కోనసీమ చిత్ర కళా పరిషత్ అంటే దేశ వ్యాప్తంగా ఉన్న చిత్రకారులందరికీ సుపరిచయం అయ్యిందంటే తమ చిత్ర యజ్ఞమే కారణం.
– కొరసాల సీతారామస్వామి, వ్యవస్థాపక కార్యదర్శి,
కోనసీమ చిత్ర కళాపరిషత్, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment