76వ గణతంత్ర దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు : కలెక్టర్
కాకినాడ సిటీ: స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 26వ తేదీన జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశపు మందిరంలో గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి సమీక్షించిన సందర్భంగా మాట్లాడారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవంలో ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొననున్న దృష్ట్యా పటిష్టమైన బందోబస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఆర్వో జె.వెంకటరావు వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివరించారు. పోలీస్ శాఖ తరఫున పోలిస్ పరేడ్ గ్రౌండ్‌లోపల, వెలుపల చేపట్టవలసిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్‌పై సూచనలు చేశారు. ప్రధాన వేదిక అలంకరణ ఇతర ఏర్పాట్లు సహా స్టేడియంలో ఇతర వసతులపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, కాకినాడ రూరల్ తహసీల్దార్‌లను ఆదేశించారు.
తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా
అవార్డుకు విజయరత్నం ఎంపిక
కిర్లంపూడి: తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా అవార్డుకు తామరాడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తిరగటి విజయరత్నం ఎంపికయ్యారు. కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమి బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రైటర్స్ ఫారం, వరల్డ్ పోయెట్రీ అకాడమి సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగుకీర్తి జాతీయ ప్రతిభా పురస్కారాలకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 21న విజయవాడలో కౌతాపూర్ణానంద విలాస్ కళావేతికలో అవార్డును అందుకుంటారు.
22న పారా అథ్లెటిక్స్‌కు
జిల్లా జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 30న జరగనున్న రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా జట్టు ఎంపికను ఈ నెల 22న కాకినాడ జిల్లా క్రీడామైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ ఎంపికలకు ఆసక్తి గలవారు ఈ నెల 20వ తేదీ లోపు 93901 31777 నంబర్‌లో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 22వ తేదీ ఉదయం 9 గంటలకు డీఎస్‌ఏలో ఎంపికలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment