నేషనల్ గేమ్స్‌కు వెయిట్ లిఫ్టర్ ధాత్రి
● 29వ సారి హాజరుకానున్న వైనం
● 10 ఏళ్ల క్రీడా ప్రస్థానంలో
17 నేషనల్ మెడల్స్ సొంతం
● వెస్ట్రన్ రైల్వేస్‌లో ఉద్యోగం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): డెహర్రాడూన్‌లో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న నేషనల్ గేమ్స్‌కు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో జిల్లాకు చెందిన వెయిట్‌లిఫ్టర్ పి.ధాత్రి ఎంపికయింది. ఇప్పటి వరకు 28 సార్లు జాతీయ క్రీడల్లో పాల్గొన్న ధాత్రి 17 సార్లు జాతీయస్థాయి మెడల్స్‌ను సొంతం చేసుకుంది. 2013లో కాకినాడ డీఎస్‌ఏలో కోచ్ వి.సతీష్‌కుమార్ వద్ద వెయిట్‌లిఫ్టింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న ధాత్రి 10 సంవత్సరాల పాటు తన కెరీర్‌ను కొనసాగించి 2023లో వెస్ట్రన్ రైల్వేస్‌లో క్రీడాకోటాలో క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగం సాధించి తోటి క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. కాకినాడ రూరల్ ఏపీఎస్పీలోని మోహన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ధాత్రి నన్నయ యూనివర్శిటీ తరఫున వీఎస్‌లక్ష్మీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ధాత్రి తండ్రి వీరబాబు, తల్లి రేణుక ఏపీఎస్పీ వద్ద చిన్న బండిపై టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్న అమ్మాయి ధాత్రి. ధాత్రికి క్రీడలపై ఉన్న ఆసక్తి గమనించిన కోచ్ సతీష్‌కుమార్ 10ఏళ్ల పాటు ఉదయం సాయంత్రం తర్ఫీదు నిచ్చి జాతీయస్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. రెండు సార్లు ఇండియా శిబిరానికి ఎంపికై అంతర్జాతీయస్థాయి పోటీలలో పాల్గొనే అవకశాం తృటిలో కోల్పోయింది. 2023లో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచీ రైల్వేస్‌కు ఆడుతోంది. సీనియర్స్ నేషనల్స్ గేమ్స్‌లో ప్రతిభను చూపి అంతర్జాతీయ స్థాయికి ఎంపికై మెడల్స్ సాధించడం తన లక్ష్యం అని ధాత్రి శుక్రవారం ‘సాక్షి’కి తెలిపింది. ఈ సందర్భంగా కోచ్ వి.సతీష్‌కుమార్ మాట్లాడుతూ డెహ్రడూన్‌లో జరిగే జాతీయ క్రీడల్లో ధాత్రి మెడల్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment