నష్టాలొస్తున్నాయి కాబట్టీ..
పిఠాపురం: కూటమి సర్కారు అనాలోచిత చర్యలతో ప్రజలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నాయి. ఓవైపు గత వైఎస్సార్ సీపీ పాలనలో వారిని ఆదుకున్న సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అనేక వ్యాపారాలు కుదేలవుతుండగా.. ఇదే సమయంలో తీసుకుని వచ్చిన ఇసుక విధానం.. రెక్కలు ముక్కలు చేసుకుంటూ నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని పూర్తి స్థాయిలో దెబ్బ తిస్తోంది. ఇసుక కొరతతో నిర్మాణ రంగం చతికిలపడింది. దీంతో లక్షలాది మంది కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూండగా.. నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషించే ఇటుక పరిశ్రమ సైతం నష్టాల ఊబిలో కూరుకుపోయింది.
12 వేల మంది జీవనం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా పిఠాపురం, పెద్దాపురం, మండపేట, అనపర్తి, రాయవరం, బిక్కవోలు, ఆలమూరు, రామచంద్రపురం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కడియం తదితర మండలాల్లో ఎక్కువగా ఇటుక బట్టీలున్నాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 1,400 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 750 వరకూ ఇటుక బట్టీలున్నట్లు అంచనా. ఒక్కో బట్టీకి ఇద్దరి నుంచి 10 మంది వరకూ యజమానులు ఉంటారు. స్థాయిని బట్టి ఒక్కో బట్టీలో రోజుకు సీజన్‌లో 10 వేల నుంచి 35 వేల వరకూ ఇటుకలు తయారు చేస్తూంటారు. ఈ బట్టీల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు తదితర జిల్లాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 12 వేల మంది కూలీలు పని చేస్తున్నారు. ఒక్కో బట్టీలో ఆరుగురి నుంచి 30 మంది వరకూ కూలీలు పనులు చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తూంటారు. నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరగక.. అమ్మకాలు పూర్తిగా పడిపోవడంతో ఇటుక బట్టీల్లో నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో పనుల్లేక కూలీలు విలవిలాడుతూండగా.. ఆదాయం లేక అప్పులపాలవుతున్నామని యజమానులు వాపోతున్నారు.
పెట్టుబడులు సైతం రాకపోవడంతో...
సాధారణంగా ఏటా నవంబర్ నుంచి మే నెల వరకూ ఇటుకలు తయారు చేస్తారు. నవంబర్‌లో ఇటుక తయారీకి సిద్ధమయ్యేనాటికి ముందు సంవత్సరం తయారైన ఇటుక అమ్ముతూంటారు. బట్టీలో వెయ్యి ఇటుక తీతకు రూ.1,000, ఇటుకకు మట్టి తయారు చేసే వారికి రూ.1,000, ఆరబెట్టే వారికి వెయ్యి ఇటుకకు రూ.100, కాల్చి అప్పగించడానికి రూ.450 వరకూ కూలి ఇవ్వాల్సి వస్తోంది. దీనికితోడు బట్టీలో ఇటుక కాల్చడానికి అవసరమైన టన్ను ఊకకు రూ.7 వేలు, టన్ను బూడిదకు రూ.1,800 వరకూ ఖర్చవుతోంది. ఇలా అన్నీ కలిపితే ఇటుక తయారీకి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇంత చేసినా.. ఇటుకలు అమ్ముడుపోకపోవడంతో పెట్టుబడి రాకపోగా చేసిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేని దుస్థితిని యజమానులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి అమ్మకాలు లేక.. చివరకు తయారీ నిలిపేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కొరతతో నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఇటుక అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని కందా వాసు చెప్పారు. గత ఏడాది వెయ్యి ఇటుక బట్టీ వద్ద రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకూ అమ్మగా, ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే పలుకుతోంది. అది కూడా నెలకో లోడు అమ్ముడవుతోందని, ఫలితంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర నష్టాలు చవి చూస్తున్నామని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు యజమానులు అడ్వాన్సుగా ఇచ్చిన సొమ్ము కుటుంబ పోషణకు ఖర్చయిపోయిందని, పనులు లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని కూలీలు వాపోతున్నారు.
బతుకుతెరువు దెబ్బ తింది
నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఎవ్వరూ ఇటుక కొనడం లేదు. దీంతో ఇటుక తయారీని యజమానులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఫలితంగా మాకు కూడా బతుకుతెరువు లేకుండా పోతోంది. ఆరు నెలలుగా కొత్త ఇటుక తీయడం లేదు. ఉపాధి లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.
– కరీంబుల్, బట్టీ కార్మికుడు, పశ్చిమ బెంగాల్
వేరే పని చూసుకోవాల్సిందే..
మాకు అలవాటైన పని ఇటుక తయారీయే. ప్రస్తుతం ఇది ఆగిపోతోంది. దీనిని నమ్ముకుని ఇంత దూరం కుటుంబ సమేతంగా వచ్చి కష్టపడుతున్నాం. ఈ పని ఆగిపోతే మాకు వేరే దారి లేదు. ఏడాదంతా పని చేసుకుని, సొంతూరు వెళ్తూంటాం. కానీ, ఈ ఏడాది ఆ అవకాశం లేకుండా పోయింది.
– ఇంద్రీస్, బట్టీ కార్మికుడు, పశ్చిమ బెంగాల్
ఇటుక బట్టీలకు గట్టి దెబ్బ
కూటమి సర్కార్ ఇసుక విధానం ఫలితం
నిర్మాణ రంగం చతికిలబడి..
ఇటుక పరిశ్రమ కుదేలు
పడిపోయిన అమ్మకాలు
పేరుకుపోతున్న నిల్వలు
పనుల్లేక పస్తులుంటున్న కార్మికులు
ఆదాయం లేక అప్పుల పాలవుతున్నామంటున్న యజమానులు
ఆరు నెలలుగా బేరాల్లేవ్..
నిర్మాణాలు జోరుగా జరిగితే రోజుకు 20 వేల నుంచి 40 వేల వరకూ ఇటుక అమ్మకాలు జరుగుతూంటాయి. ఒక్కోసారి లక్ష ఇటుకలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయని బట్టీల యజమానులు చెబుతున్నారు. అటువంటిది కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకు వచ్చిన ఉచిత ఇసుక విధానంతో ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. దీంతో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఇటుక వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. గడచిన 4 నెలలుగా 10 వే ల ఇటుకలు కూడా అమ్మలేకపోయామని యు.కొత్తపల్లి మండలం కొండెవరానికి చెందిన ఇటుక బట్టీ యజమానులు మారిశెట్టి బుజ్జి, కందా వాసు తదితరులు చెప్పారు. ఇసుక అందుబాటులో ఉ న్నప్పుడు వెయ్యి ఇటుక రూ.7 వేలు ఉండగా ప్ర స్తుతం రూ.5 వేలు మాత్రమే పలుకుతోందని, అ యినప్పటికీ బేరాలు రావడం లేదని వాపోతు న్నారు. ఆరు నెలల నుంచి లక్షల ఇటుక నిల్వలు అలాగే ఉండిపోయాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment