యథావిధిగా రేపు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం
కాకినాడ సిటీ: జిల్లా స్థాయిప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపా రు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులు విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని స్పష్టం చేశారు.
ఖాళీ పోస్టుల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ సిటీ: ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ఉమాదేవి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. హెల్త్ సూపర్‌వైజర్ పోస్టులు–2 (పురుషులు), బాలికల గురుకులాల్లో హెల్త్ సూపర్‌వైజర్‌తో పాటు జువాలజీ–1, ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన భర్తీ చేస్తామని వివరించారు. గతంలో గురుకులాలల్లో పని చేసిన వారికి ఏడాదికి ఒకటి చొప్పున గరిష్టంగా ఐదు మార్కులు ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటాతో పాటు ధ్రువపత్రాల నకళ్లతో కలెక్టరేట్ వికాస కార్యాలయం పై భాగంలో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐ సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 22లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు పోస్టు గాడ్యుయేషన్‌లో ఫస్ట్‌క్లాస్‌తో పాటు బీఎడ్, టెట్, బీఎస్సీ నర్సింగ్‌లో అర్హత పొందిన వారు అర్హులని ఉమాదేవి తెలిపారు.
స్వచ్ఛతపై అవగాహన
కల్పించాలి
కాకినాడ సిటీ: స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో సక్రమంగా నిర్వహించి, స్వచ్ఛతపై అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. డీఆర్‌ఓ జె.వెంకట్రావుతో కలిసి ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ చుట్టూ ఉన్న పౌరసరఫరాలు, వికాస, వివేకానంద హాలు, డ్వామా కార్యాలయ ఆవరణలోని ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర చెత్త తొలగించి శుభ్రం చేశారు. వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో జేసీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా, మాట్లాడుతూ, ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీపీవో పి.త్రినాథ్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.దేవులానాయక్, వికాస పీడీ కెలచ్చారావు, జౌళి శాఖ ఏడీ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
శృంగార వల్లభుని
సన్నిధికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి సన్నిధికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో శృంగార వల్లభుని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, అన్నదాన విరాళాలు, కేశఖండన టికెట్ల ద్వారా స్వామి వారికి రూ.2,94,760 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎనిమిది వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment