వారికే ప్రసాద్‌ం పెట్టాలని..!
ఇవీ ప్రసాద్ నిర్మాణాలు
● దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.10 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం.
● ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.6 కోట్లతో క్యూ కాంప్లెక్స్.
● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా వాడుతున్న చోట అటు సత్యగిరికి, ఇటు రత్నగిరికి చేరువగా ఉండేలా రూ.3 కోట్లతో టాయిలెట్ బ్లాకుల నిర్మాణం.
● ప్రసాద్ నిధులతో దేవస్థానానికి రూ.కోటి వ్యయంతో రెండు బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. వీటిని దేవస్థానంలో సత్రాల నుంచి స్వామి వారి ఆలయం, వ్రత మండపాలు మధ్య భక్తులను తరలించేందుకు ఉపయోగిస్తారు.
● రత్నగిరిపై ‘ప్రసాద్’ నిర్మాణాలకు
మళ్లీ టెండర్లు
● అక్టోబర్‌లో రెండు ప్యాకేజీలుగా పిలిచినవి రద్దు
● ఏకంగా రూ.18.98 కోట్లతో ఒకే ప్యాకేజీ
● ఓ అమాత్యుని సన్నిహితునికి
కట్టబెట్టేందుకేనంటున్న కాంట్రాక్టర్లు
● కాదంటున్న అధికారులు
అన్నవరం: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీమ్‌కు అన్నవరం దేవస్థానం ఎంపికై న విషయం తెలిసిందే. ఈ ఎంపిక ఏ ముహూర్తాన జరిగిందో కానీ.. వ్యవహారం ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనుకకు.. అన్నట్టుగా సాగుతోంది. ఇందులో భాగంగా సుమారు రూ.20 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. పచ్చజెండా అయితే ఊపింది కానీ.. నిధుల విడుదలలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు మొండిచేయే చూపించింది. ఎట్టకేలకు ఆ నిధులతో చేపట్టే వివిధ పథకాల పనులకు గత ఏడాది మార్చి 7న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
అందుకేనా.. పాత టెండర్ల రద్దు !
ప్రసాద్ నిధులతో రత్నగిరిపై వివిధ నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ గత ఏడాది అక్టోబర్‌లో ఈ–ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లు పిలిచింది. దీనికి 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం అదే నెల 25వ తేదీన అధికారులు టెండర్లు తెరచి అతి తక్కువకు దాఖలు చేసిన కాంట్రాక్టర్లను ఖరారు చేయాలి. కానీ, అధికారులు టెండర్లు తెరవకుండానే అనూహ్యంగా వాటిని డిసెంబర్‌లో రద్దు చేశారు. ఈ నెల 9న రీ టెండర్ పిలిచారు. గతంలో వచ్చిన టెండర్లలో రాష్ట్ర అధికార కూటమిలోని ఒక మంత్రి సన్నిహితుడికి చెందిన సంస్థ కూడా ఒకటి ఉంది. దానికి ఈ టెండర్లు కట్టబెట్టేందుకు గాను రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, అది సాధ్యం కాకపోవడంతో వాటిని రద్దు చేసి, మళ్లీ పిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రసాద్ స్కీమ్ నిధులు సకాలంలో విడుదల కానందు వల్లనే పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ కొత్తగా పిలిచామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.
బడా కాంట్రాక్టర్లకే అవకాశం !
గత ఏడాది రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలవగా.. ఈసారి ఏకంగా రూ.18.97 కోట్లకు ఒకే ప్యాకేజీగా పిలవడం గమనార్హం. ఈ నిధులతో అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, పురుషులకు, మహిళలకు విడివిడిగా టాయిలెట్ బ్లాకుల నిర్మాణాలకు తాజాగా టెండర్ పిలిచారు. సత్రాల నుంచి ఆలయానికి భక్తులు రాకపోకలు సాగించేందుకు రెండు బ్యాటరీ కార్లు నడిపేందుకు విడిగా టెండర్ పిలవనున్నారు. గత ఏడాది టెండర్లు పిలిచినప్పుడు 12 మంది కాంట్రాక్టర్లు కొటేషన్లు దాఖలు చేయగా.. ఈసారి ఒకే ప్యాకేజీ కావడంతో బడా కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment