శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
సామర్లకోట: శిక్షణను గిరిజన ప్రాంత అధికారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) ప్రిన్సిపాల్ జె.వేణుగోపాల్ అఽన్నారు. పరిపాలనలో అవగాహన పెంచడానికి, పీసా చట్టంపై రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంత ప్రజల హక్కులను కాపాడేందుకు ఆయా ప్రాంతాల ఎంపీడీఓ, ఈఓ పీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ఆయా జిల్లాల్లో మండలాల వారీగా గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గిరిజనులు ఉపయోగించుకునేలా చూడాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో రెండో బ్యాచ్ శిక్షణ ఉంటుందని వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఇ.కృష్ణమోహన్, ఏపీఎస్‌ఐఆర్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ శ్రీదేవి, డిప్యూటీ డైరెక్టర్ రామనాథం, ఫ్యాకల్టీలు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ కబడ్డీ పోటీలకు
అంపైర్లుగా ఎంపిక
సామర్లకోట: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) అంపైర్లుగా ఎంపిక అయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగే 38వ జాతీయ క్రీడా పోటీలకు టెక్నికల్ అఫీషియల్స్(అంపైర్లు)గా జిల్లాకు చెందిన పీడీలు బోగిళ్ల మురళీకుమార్, శ్రీనివాసకుమార్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి వీరిద్దరే ఎంపిక కావడం విశేషం. ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయంటూ వారిని జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ అభినందించారు. ఆయనతో పాటు కొండపల్లి శ్రీనివాస్, జాతీయ కబడ్డీ కోచ్ పోతుల సాయిప్రసాద్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు నిమ్మకాయల కిరణ్, తాళ్లూరి వైకుంఠం కూడా పీడీలను అభినందించారు. మురళీకుమార్ ఇప్పటికే ప్రో కబడ్డీకి 10 పర్యాయాలు అంపైర్‌గా పని చేశారు. అలాగే, ఆస్ట్రేలియాలో జరిగిన భారత్ – ఆస్ట్రేలియా కబడ్డీ మ్యాచ్‌కు కూడా అంపైర్‌గా వ్యవహరించారు. శ్రీనివాస్ కుమార్ కాకినాడ రూరల్ గొడారిగుంట మున్సిపల్ హైస్కూల్‌లోను, మురళీకుమార్ జగ్గంపేట ప్రభుత్వ హైస్కూల్‌లోను పీడీలుగా పని చేస్తున్నారు.
బీచ్‌లో నేడు కాకినాడ మారథాన్
కాకినాడ రూరల్: సూర్యారావుపేట బీచ్‌లో ఆదివారం ఉదయం కాకినాడ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఇది బీచ్ నుంచి ఉప్పాడ వరకూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 6.30 నుంచి 10 గంటల వరకూ బీచ్ రోడ్డులో ట్రాఫిక్ బంద్ చేస్తున్నట్టు తిమ్మాపురం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment