గోదావరి టు గంగ... | - | Sakshi
Sakshi News home page

గోదావరి టు గంగ...

Published Sun, Jan 19 2025 2:25 AM | Last Updated on Sun, Jan 19 2025 2:25 AM

గోదావ

గోదావరి టు గంగ...

ప్రయాగరాజ్‌ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న జనం

మహా కుంభమేళాతో జిల్లాకు అనుబంధం

ప్రయాగరాజ్‌కు భారీగా వెళ్తున్న భక్తులు

ఇక్కడి నుంచే కొబ్బరి, వక్క ఎగుమతి

సాక్షి, అమలాపురం: గంగ.. గోదావరి. ఒకటి ఉత్తర భారతం.. మరొకటి దక్షిణ భారతదేశం. ప్రాంతం వేరైనా రెండింటికీ చాలా దగ్గర బంధం ఉంది. వీటి చుట్టూ రామాయణ, మహాభారత పురాణ గాథలున్నాయి. హిందువులకు సంబంధించి ఈ రెండు నదులను ఆనుకుని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. గోదావరి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తే, గంగకు సైతం 12 ఏళ్లకు పూర్ణ కుంభమేళా జరుగుతోంది. చనిపోయిన వారి అస్తికలు ఈ రెండు నదుల్లో కలపడం కూడా పుణ్యంగా భావిస్తారు. ఇవన్నీ చూసే గోదావరిని దక్షిణ గంగగా సంబోధిస్తారు. మహా కుంభమేళా క్రతువును వీక్షించేందుకు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు వేలాది మంది గోదావరి వాసులు ప్రయాగరాజ్‌ బాట పట్టారు. కుంభమేళా సందర్భంగా నదిలో నిర్వహించే పూజలు.. నదిని ఆనుకుని చేసే యజ్ఞాల్లో గోదావరి జిల్లాలో పండే కొబ్బరి.. పోక కాయల వంటివి ప్రముఖ స్థానంలో ఉంటాయి. తద్వారా గంగ, గోదావరి అనుబంధం మరోసారి తేటతెల్లమవుతోంది.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులు నదీ, సముద్ర పుణ్యస్నానాలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాల్లో ఒక్క చోట అని కాకుండా గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రతి ఘాట్‌ వద్ద పుణ్యస్నానాలు చేయడం సర్వసాధారణం. ఇది కాకుండా భీష్మ ఏకాదశి, చొల్లంగి అమావాస్య, అంతర్వేది కల్యాణోత్సవాల వంటి సమయాల్లో సముద్ర స్నానాలు చేసి పాప పరిహారం జరిగిందనుకుంటారు. అలాగే, దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమున, సింధు, నర్మద, మహానది, కావేరి, కృష్ణ వంటి నదుల్లో పుణ్య స్నానాలకు సైతం భక్తులు తరలి వెళ్తారు. ఈసారి ప్రతి 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా కావడంతో ప్రయాగరాజ్‌ వద్ద స్నానాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. కాకినాడ, విజయవాడ, విశాఖ నుంచి ప్రయాగరాజ్‌కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. కొంతమంది భక్తులు, హిందూ సంఘాల వారు బస్సులు ఏర్పాటు చేసుకుని మరీ మహా కుంభమేళాకు తరలివెళ్తున్నారు. సంక్రాంతి పండగ ముగియడంతో గోదావరి జిల్లాల నుంచి దీనికి వెళ్లేవారి సంఖ్య మరింత పెరగనుంది.

అక్కడ కుంభమేళా... ఇక్కడ పుష్కరాలు

గంగ, గోదావరికి కుంభమేళా, పుష్కరాలతో పోలిక చెప్పవచ్చు. దేశంలోని ప్రధాన నదులన్నింటికీ 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి. కానీ గంగకు సాధారణ కుంభమేళా (నాలుగేళ్లకు), అర్ధ కుంభమేళా (ఆరేళ్లకు), పూర్ణ కుంభమేళా (12 ఏళ్లకు), మహా కుంభమేళా (144 ఏళ్లకు) ఒకసారి జరుగుతాయి. గోదావరికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. గతంలో 2015లో జరిగిన పుష్కరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం పన్నెండు పుష్కరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరంగా ప్రచారం చేసింది. కుంభమేళా, గోదావరి పుష్కరాలకు మాత్రమే కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తుంటారు. గోదావరికి సైతం 2027లో పుష్కరాలు రానున్నాయి. గతంలో 2015లో జరిగిన పుష్కరాలలో సుమారు 10 కోట్ల మందికి పైగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రధాన ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు చేశారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరగనుందని అంచనా. గంగా నదిని ఆనుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వారణాసి (కాశీ), హరిద్వార్‌, హృషీకేశ్‌, అలహాబాద్‌ ఉండగా, గోదావరిని ఆనుకుని నాసిక్‌, బాసర, కాళేశ్వరం, భద్రాచలం, రాజమహేంద్రవరం, కొవ్వూరు, అంతర్వేది, కోటిపల్లి, మురమళ్ల, అప్పనపల్లి వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వారణాసిలో గంగా హారతి, రాజమహేంద్రవరంలో గోదావరి హారతి ప్రత్యేకత చాటుతున్నాయి.

కుంభమేళాలో కోనసీమ కొబ్బరి.. వక్క

కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌తో పాటు త్రివేణీ సంగమ ప్రాంతంలో జరుగుతున్న పూజలు, యజ్ఞాల్లో గోదావరి జిల్లాల్లో పండుతున్న కొబ్బరి, పోక (వక్క) ప్రధాన సామగ్రి అయ్యాయి. గంగతోపాటు ఉత్తరాదిలో నదుల్లో పువ్వులు, పత్రి, కొబ్బరి కాయలను వదలడం అక్కడి వారికి ఆనవాయితీ. దీంతో గోదావరి జిల్లాల నుంచి కురిడీ కొబ్బరి కుంభమేళాకు ఎగుమతి అవుతోంది. అలాగే యజ్ఞాలు, హోమాల్లో పచ్చి వక్క (పోక కాయలను) వాడుతుంటారు. ఇవి కూడా గోదావరి జిల్లాల రైతుల నుంచి వ్యాపారులు సేకరించి మహా కుంభమేళాకు పంపుతున్నారు.

గోదావరి పుష్కరాల్లో భక్తుల పుణ్యస్నానాలు (ఫైల్‌)

రాజమహేంద్రవరంలో గోదావరి హారతి (ఫైల్‌)

ఆ అనుభూతి వర్ణించలేం

పూర్ణ కుంభమేళాలో త్రివేణీ సంగమ ప్రాంతంలో నాగ సాధువులు, ఆ తరువాత ప్రొటోకాల్‌ ప్రకారం ఇతర సాధువులు పుణ్యస్నానాలు చేసిన తరువాత నేను స్నానం చేశాను. సాధువులు స్నానం చేసిన తరువాత దిగువన స్నానం చేస్తే కలిగే అనుభూతి వేరు. వారు స్నానం చేసిన నీటిలో సామాన్యులు స్నానం చేస్తే సాధువుల నుంచి వచ్చే వైబ్రేషన్స్‌ మనల్ని పునీతులను చేస్తాయి.

– చెరుకూరి కృష్ణంరాజు,

మురమళ్ల, ఐ.పోలవరం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
గోదావరి టు గంగ...1
1/3

గోదావరి టు గంగ...

గోదావరి టు గంగ...2
2/3

గోదావరి టు గంగ...

గోదావరి టు గంగ...3
3/3

గోదావరి టు గంగ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement