బిచ్కుంద(జుక్కల్): మండలంలోని హజ్గుల్ మంజీరా నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్సై మోహన్‌రెడ్డి బిచ్కుంద శివారులో మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించామని, ఎవరైన అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
అక్రమంగా దాచిన కలప..
ఎల్లారెడ్డి: జాన్కంపల్లి ఖుర్దు గ్రామ శివారులో అక్రమంగా దాచి ఉంచిన టేకు కలపను పట్టుకుని సీజ్ చేసినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ నాయక్ గురువారం తెలిపారు. గ్రామ శివారులోని పంట పొలంలో అక్రమంగా కలప దాచి ఉంచారన్న సమాచారం రావడంతో అటవీశాఖ సిబ్బందితో దాడులు నిర్వహించి, గ్రామానికి చెందిన గొల్ల నారాయణ పొలంలో దాచిన టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని ఎల్లారెడ్డి అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఆయన తెలిపారు.
దేవునిపల్లిలో బైక్ చోరీ
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి బైక్ చోరీ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని దుంపల దత్తుకు చెందిన టీఎస్ 17ఎల్ 4987 నెంబర్ గల బైక్ ఇంటి ఆవరణలో నిలిపి నిద్రించగా, గురువారం లేచి చూసేసరికి చోరీకి గురైందన్నారు. ఈవిషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు.
రేషన్ బియ్యం కేసులో ఒకరి రిమాండ్
ఖలీల్‌వాడి: రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులో ఒకరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి గురువారం తెలిపారు. నగరంలో ని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఆశోక్ నగర్‌లో రేషన్ బియ్యం తరలింపు కేసులో సమీర్‌ను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారం క్రితం కేసు నమోదు అయినట్లు సమాచారం.
బైక్ దహనం
మాక్లూర్: మండలంలోని గుంజ్లి గ్రామంలో ఇంటి ఎదుట ఉంచిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారని మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామంలోని కురుమ పత్తేపూర్ కిషన్‌కు చెందిన బైక్ ఇంటి ఎదుట ఉంచగా బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. బైక్‌కు అంటుకున్న మంటలతో ఇంటి కిటికీ కాలిపోయి ఇంట్లోకి పొగలు రావడంతో ఇంట్లోని వారు మేల్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కిషన్ ఇటీవల ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా అతని కుమారుడు బైక్‌ను నడుపుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment