‘వంటా వార్పు’తో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
కామారెడ్డి టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం పదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె శిబిరం వద్ద ఉద్యోగులు వంటా వార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి భోజనాలు ఆరగించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. బడుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రోడ్డుపైన భోజనం చేసేలా ప్రభుత్వం చేసిందని విమర్శించారు. 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షులు వాసంతి, నాయకులు రాములు, సంతోష్‌రెడ్డి, శ్రీధర్, దామోదర్, శైలజ, తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పడాల రవీందర్ మాధవ్ దీక్షా శిభిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.
ఆంగ్ల ఉపాధ్యాయుల మద్దతు
నిజాంసాగర్(జుక్కల్): సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు గురువారం మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో ఆంగ్ల ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. నిజాంసాగర్, మహమ్మద్‌నగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్ మండలాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయులకు మహమ్మద్ నగర్ ఉన్నత పాఠశాలలో కాంఫ్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయులు ఫ్లకార్డులతో సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment