నాణ్యమైన భోజనం అందేలా చూస్తాం
పెద్దకొడప్‌గల్ : విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందేలా చూస్తామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు గురువారం ఉడికీఉడకని అన్నం తిని అస్వస్థత కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయమై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై జిల్లా అధికారులు స్పందించారు. వసతి గృహా న్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త బియ్యం రావడం వల్ల అన్నం ముద్దగా మారిందన్నారు. కొత్త బియ్యం స్థానంలో పాత బియ్యం పంపించామని పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ వంట మనిషిని తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేస్తామన్నారు. అందుబాటులో ఉండని హాస్టల్ వార్డెన్‌ను వేరే స్థానానికి పంపిస్తామన్నారు. అస్వస్థత కు గురైన విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కిషన్, తహసీల్దార్ దశరథ్, ఎస్సై మహేందర్, ఇన్‌చార్జి ఏఎస్‌డబ్ల్యూ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆకలి బాధ తీరింది
నిజాంసాగర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తిరిగి ప్రారంభమైంది. సకాలంలో బిల్లులు రాకపోవడంతో వంట చేయలేమంటూ ఏజెన్సీ నిర్వాహకులు చేతులు ఎత్తేయడంతో పాఠశాలలో 18 రోజులుగా వంట బంద్ అయ్యింది. ఈ విషయమై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి పాఠశాలను సందర్శించి అధికారులు, మహిళలతో మాట్లాడారు. ఆమె విజ్ఞప్తి మేరకు వంట చేయడానికి మహిళలు ముందుకు వచ్చారు. దీంతో శుక్రవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందింది. మధ్యాహ్న భోజనాన్ని మండల ప్రత్యేకాధికారి శ్రీపతి, ఎంపీడీవో గంగాధర్, తహసీల్దార్ భిక్షపతి, ఎంఈవో తిరుపతిరెడ్డి తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment