ఇసుక పంచాయతీ తెగేనా?
పెంచిన ఇసుక ధరలు..
బిచ్కుంద(జుక్కల్): ఇసుక వివాదం పుల్కల్, హజ్గుల్ గ్రామాల మధ్య చిచ్చురేపుతోంది. మా గ్రామం మంజీరా నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి ఇతర గ్రామాల ట్రాక్టర్లను రానివ్వమంటూ రెండు గ్రామాల మధ్య వివాదం జిల్లా అధికారుల ముందుకు వెళ్లింది. పుల్కల్ శివారులోని మంజీరా నదిలో చెక్ డ్యాం నిర్మిస్తున్నారు. మంజీరా నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇళ్ల నిర్మాణాలకు, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఇసుకను తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. క్యూబిక్ మీటరు చొప్పున ట్రాక్టర్ యజమానులు ప్రభుత్వానికి చార్జీలు చెల్లించి ఇసుకను తీసుకెళ్తున్నారు. బిచ్కుంద, శెట్లూర్, ఖద్‌గాం, హజ్గుల్ గ్రామ ట్రాక్టర్లు సీనరేజ్ చార్జీలు చెల్లించి మేము కూడా పుల్కల్ మంజీరా నుంచి ఇసుకను తీసుకెళ్లాడానికి అనుమతి ఇవ్వాలని అధికారులకు కోరారు. ఇతర గ్రామాలకు చెందిన ట్రాక్టర్లను ఇసుక తీసుకెళ్లడానికి రానివ్వమని పుల్కల్ ట్రాక్టర్ల యజమానులు మంజీరాలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వానికి సీనరేజ్ చార్జీలు చెల్లిస్తున్నాము అందరికి అనుమతి ఉంది ఎందుకు రానివ్వరని హజ్గుల్ ట్రాక్టర్ యజమానులు గొడవకు దిగుతున్నారు. ఇసుక వివాదం రెండు మూడు గ్రామాల మధ్య చిచ్చురేపుతోంది. ఇసుక వివాదం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. బాస్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మైన్స్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక తరలింపుపై పుల్కల్, హజ్గుల్ రెండు గ్రామాల ట్రాక్టర్ యజమానులతో రెండు రోజుల క్రితం బిచ్కుందలో చర్చించారు. సఖ్యత కుదరలేదు. వివాదం అలాగే ఉంది. ఇసుక లొల్లి ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియని పరిస్దితి ఉంది.
పుల్కల్, హజ్గుల్ గ్రామాల
మధ్య ఇసుక వివాదం
అధికారులు చర్చలు జరిపినా
కుదరని సయోధ్య
ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న వారికి ఇసుక బంగారంగా మారింది. బిచ్కుంద చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు మంజీరా పది కిలో మీటర్ల దూరంలో ఉన్నప్పటికి ఇసుక దొరకడం లేదు. పుల్కల్ గ్రామం నుంచి మాత్రమే ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి ఉంది ఇదే అదునుగా భావించిన ఆ గ్రామ ట్రాక్టర్ల యజమానులు ఇసుక ధరలు రెట్టింపు చేశారు. రూ.2 వేలకు లభించే ఇసుక ఇప్పుడు బిచ్కుందలో ఒక ట్రాక్టరు ఇసుక రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. పిట్లం, జుక్కల్, కంగ్టి మండలాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాలకు విక్రయిస్తే నాలుగు వంతులు లాభం వస్తుంది. దీంతో కొందరు బిచ్కుందలో విక్రయించకుండా ఇతర ప్రాంతాలకు ఇసుక తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించకుండా, ధరలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment