పేదల ఇల్లు పైకప్పు వరకు నిర్మాణం పూర్తయి ఆగిపోయిన దృశ్యం
సాక్షి,బళ్లారి: అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు, కోట్లాది మందికి అన్నం పెడుతున్న తుంగభద్ర డ్యాం, దేశంలోనే అతి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీల్లో ఒకటైన జిందాల్ ఉక్కు కర్మాగారం, పదుల సంఖ్యలో స్పాంజ్ ఐరన్ కంపెనీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి బళ్లారి జిల్లాలో అపారమైన ఖనిజ సంపద, ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ట్యాక్స్‌లు, వందల సంఖ్యలో అపర కుబేరులు ఉన్నా, అంతకన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపేణా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నా జిల్లాలో పేదలకు కనీసం నిలువ నీడ కూడా లేదు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో మట్టి ఇంటిలో, గుడిసెల్లో నివాసం ఉంటూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గుడిసె రహిత జిల్లాగా మారుస్తామని పాలకులు చెబుతున్నారే కాని ఆచరణలో మాత్రం అమలు కాకపోవడంతో గుడిసెలు, మట్టి ఇళ్లలోనే నివాసం ఉంటున్నామని పేదలు కన్నీరు పెడుతున్నారు.
ఏళ్లతరబడి పూర్తి కాని ఇళ్ల నిర్మాణాలు
ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మారుతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహా..ఓహో..అంటూ జిల్లా రూపురేఖలే మారుస్తామని చెబుతున్నారే కాని లబ్ధిదారులకు ఎంపిక చేసిన వాటిలో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఇళ్లు నేటికీ పూర్తి కావడం లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు జిల్లాలో పేదలకు సొంత ఇంటి కల ఏమేరకు పూర్తి చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ అనే భేదభావం లేకుండా దొందూదొందుగా పాలన సాగిస్తున్నారని జనం విమర్శిస్తున్నారు. నగరంలోని ముండ్రిగి సమీపంలో దాదాపు 6 వేల ఇళ్ల నిర్మాణాలు ఒక వైపు నేటికీ పూర్తి కాకపోవడంతో పాటు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆశ్రయ యోజన నివాసాలు(పీఎంఏవైజే), బసవ వసతి యోజన, దేవరాజ్ అరసు వసతి, వాజ్‌పేయి వసతి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వసతి తదితర పథకాల కింద గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 5800 మంది పేదలకు గుర్తించి వారికి సొంత ఇల్లు కట్టించేందుకు శ్రీకారం చుట్టారు.
అరకొరగానే ఇళ్ల నిర్మాణం పూర్తి
ఐదేళ్లుగా జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గంలో దాదాపు 1200 ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించి అనుమతి ఇస్తే అందులో 300 ఇళ్లు, కంప్లి నియోజకవర్గంలో దాదాపు 1400 ఇళ్లకు అనుమతి లభిస్తే అందులో 400, సండూరు నియోజకవర్గంలో 1300 ఇళ్లకు అనుమతి ఇస్తే 300, సిరుగుప్ప నియోజకవర్గంలో దాదాపు 1800 ఇళ్లకు అనుమతి ఇస్తే అందులో 350 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో సగంలోనే ఆపేసినవి, ప్రగతిలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి. లబ్ధిదారులు సంబంధిత అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నిధుల కొరత లేదా నిర్లక్ష్యం వల్ల అర్ధంతరంగా ఇళ్ల నిర్మాణాలు ఆపేశారని పేదలు కన్నీరు పెడుతున్నారు. 2018 నుంచి నేటికీ కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఆరు వేల మంది లబ్ధిదారులకు సొంత ఇల్లును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
దండిగా నిధులున్నా చిత్తశుద్ధి సున్నా
జిల్లాలో డీఎంఎఫ్, కేఎంఆర్‌సీ నిధులు కూడా వేల కోట్లు మూలుగుతున్నాయి. నిధులు ఉన్నా అధికారులు, పాలకుల్లో చిత్తశుద్ధి లోపించింది. పేదలకు సొంత ఇళ్ల నిర్మాణాలకు ఈఆ నిధులను మళ్లించకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు మట్టి ఇళ్లలో నివాసం ఉండేవారు పలువురు మృతి చెందుతున్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు పేదలు మట్టి ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో జీవిస్తున్నారు. జిల్లాలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి నేటికీ ఇంకా పునాదుల వరకే కొన్ని, లింటల్, టాప్ లెవెల్ వరకు మరికొన్ని అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈ విషయంపై సంబంధిత అధికారిని వివరణ కోరగా గత ఐదేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు వివిధ పథకాల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు గట్టి చర్యలు తీసుకున్నాం. కోవిడ్ తదితర కారణాలతో ఇళ్ల నిర్మాణాలు ఆలస్యం అయిన మాట వాస్తవమేనన్నారు. త్వరలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు, నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పూరి గుడిసెలు, మట్టి ఇళ్లలోనే పేదల నివాసాలు
పాలకుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్న సామాన్య ప్రజలు
అటకెక్కిన గుడిసె రహిత జిల్లాగా మారుస్తామన్న హామీ
Comments
Please login to add a commentAdd a comment