యశవంతపుర: ఇటీవల ఉడుపిలో ఒకే కుటుంబంలో నలుగురిని హత్య చేసిన నిందితుడు ప్రవీణ్ చౌగలే.. ఏమాత్రం భయం, బాధ లేకుండా తీరిగ్గా టపాసులు కాల్చి దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఈ నెల 12న పండుగ రోజు ఉదయం తల్లీ, ఇద్దరు కూతుళ్లు, కొడుకుని హత్య చేశాడు. పోలీసులు నిందితున్ని కోర్టులో హాజరు పరిచి కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో అనేక విషయాలను వెల్లడించాడు. యువతి ప్రేమించలేదనే పగతో ఆమె కుటుంబాన్ని మట్టుబెట్టాడు.
మంగళూరుకు వెళ్లి, ఆపై బెళగావికి
హత్యాస్థలి నుంచి ఉడుపి బస్టాండుకు వెళ్లాడు. రెండు సార్లు బైకిస్టులను లిఫ్టు అడిగి, ఒకసారి ఆటోలో ఎక్కి బస్టాండుకు చేరుకున్నాడు. హత్య సమయంలో పెనుగులాటలో చేతికి గాయం కాగా, ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఆపై ఫోన్‌ను స్విచాఫ్ చేసి మంగళూరుకు వెళ్లాడు. మంగళూరులో తన కుటుంబంతో కలిసి దీపావళి పండుగను చేసుకుని, ఆపై బయటకు వెళ్లి సంతోషంగా గడిపాడు. తరువాత రోజు ఒక్కడే కారులో బయలుదేరి బెళగావికి చేరుకున్నాడు. అక్కడ తన మొబైల్‌ను ఆన్ చేశాడు. ఉడుపి పోలీసుల సూచనతో బెళగావి జిల్లా కుడిచి పోలీసులు అతన్ని ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment