దారితప్పిన టీనేజీ
ముళబాగిలులో టీచర్ హత్య కేసు..
7 మంది అరెస్టు, నలుగురు మైనర్లే!
ఇల్లు దోచుకోవాలని ప్లాన్
కోలారు: కోలారు జిల్లా ముళబాగిలు పట్టణంలో ఈ నెల 14వ తేదీన రాత్రి జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దివ్యశ్రీ (44) హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసులు 7 మంది నిందితులను అరెస్టు చేశారు. అందరూ టీనేజీలో ఉన్నవారే కాగా, డబ్బు కోసం ఆశపడి ఆమెను పొట్టనబెట్టుకున్నారు.
వాటర్ క్యాన్లు సరఫరా చేస్తూ..
పోలీసులు తెలిపిన మేరకు... ముళబాగిలులోని సుంకు లేఅవుట్‌లో నివాసం ఉంటున్న పద్మనాభ భార్య టీచర్ దివ్య శ్రీ, కూతురితో సొంత భవనంలో నివసిస్తున్నారు. రంజిత్ (20) అనే యువకుడు ఆటోలో వాటర్ క్యాన్లను ఇంటింటికీ సరఫరాచేసేవాడు. ఈ సమయంలో పద్మనాభ ఇంటికి వస్తూ బాగా డబ్బున్నట్లు తెలుసుకుని దోపిడీకి పథకం వేశాడు. స్నేహితుడు షాహిద్‌ఖాన్ (19), యువరాజు (20), మరో నలుగురు మైనర్లతో కలిసి చర్చించాడు. వీరందరూ స్థానికంగా పోకిరీగా తిరిగేవారు. ఆ రోజు నలుగురు బయట కాపలా ఉండగా, ముగ్గురు ఇంట్లోకి చొరబడి కత్తులతో దివ్యశ్రీని నరికి చంపారు. కూతురు అది చూసి భయంతో పారిపోవడంతో ప్రాణాలు దక్కాయి. కొంత డబ్బు దొరికితే తీసుకుని వెళ్లిపోయారు. పోలీసులు స్థానిక సీసీ కెమెరాల చిత్రాలు, ఇతరత్రా ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. చివరకు ఈ పిల్లల పనేనని గుర్తించారు.
మత్తుకు బానిసలై..
ముక్కుపచ్చలారని వయసులో సినిమాల ప్రభావంతో ఈ కిరాతకానికి పాల్పడ్డారు. ఇది కిరాయి హత్య?, భర్త వ్యాపార లావాదేవీల్లో వివాదం వల్ల జరిగిందా? అని అనేక అనుమానాలు వచ్చాయి. ఈ నిందితులు గంజాయి వాడేవారు, మత్తు పదార్థాలకు బానిసలై ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయట పడే అవకాశం ఉంది. పిల్లలు అరెస్టు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment