అనాథగా మారిన శిశువు
మండ్య: భార్య అనుమానాస్పద మృతితో భయపడిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మండ్య జిల్లాలోని కేఆర్ పేటె తాలూకా గద్దె హొసూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మోహన్ గౌడ (27)తో బేవినహళ్లి గ్రామానికి చెందిన స్వాతి (22) అనే యువతికి మూడేళ్ల క్రితం పెళ్లయింది. దంపతులకు ఏడాదిన్నర వయస్సుగల కుమార్తె ఉంది. స్వాతి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నట్లు అనుమానాస్పద రీతిలో మరణించింది.
దీంతో స్వాతి పుట్టింటి వారు భర్త మోహన్, అతని కుటుంబ సభ్యులే తమ బిడ్డను పొట్టన బెట్టుకున్నారని బుధవారం ఉదయం మోహన్ ఇంటికి నిప్పంటించి గొడవ చేశారు. భార్య మరణం, తనపై నిందలు వేయడంతో ఆవేదన చెందిన భర్త ఊరిబయట చెరువులోకి దూకి చనిపోయాడు. తల్లిదండ్రులు దూరమై చిన్నారి అనాథగా మారింది. కిక్కేరి పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. గ్రామంలో ఘర్షణలు జరకుండా పోలీసులు మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment