హుబ్లీ: జంట నగరాల్లో క్రిస్మస్ కళ, సందడి నెలకొంది. బుధవారం శాంతి దూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకొనే క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవ మందిరాలన్నీ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. కేశ్వాపుర సెయింట్ జోసెఫ్ క్యాథలిక్ చర్చి, శాంతినగర్ ఇన్‌ఫ్యాంట్ జీసస్ చర్చి, ఉణకల్ వద్ద ములార్ మెమోరియల్ చర్చి, కార్వార రోడ్డులోని మయర్ మెమోరియల్ చర్చి, గంటికేరిలోని ఏసునామ మహా దేవాలయం, అలాగే ప్రవాసాంధ్రులు అత్యధికంగా నివసించే గదగ్ రోడ్డు సెయింట్ పీటర్ చర్చితో పాటు వివిధ ప్రార్థన మందిరాల్లో ఏసయ్య భక్తులు తగిన ఏర్పాట్లతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. సామూహిక గానంతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఏసుక్రీస్తు సందేశం చాటడానికి ఇంటింటికీ వెళ్లి మంగళవారం రోజంతా క్యారెల్స్ సాంగ్ పాడుతూ విశ్వాసులు ఏసయ్య శాంతి సందేశాన్ని చాటి చెబుతున్నారు. ఏసు జన్మనిచ్చిన సంతోషం నేపథ్యంలో ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఆకాశ పుట్టలు క్రిస్మస్ ట్రీలతో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించి బంధువులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్లలో పండుగ సంబంధిత వస్తువుల కొనుగోళ్లు, కొత్త బట్టలు, ఆకాశపుట్టలు, చాక్లెట్లు, కేక్‌లు ఇతర మిఠాయిల కొనుగోలులో క్రైస్తవ బాంధవులు మునిగిపోయారు. ప్రత్యేకించి చిన్నారులు శాంతాక్లాజ్ వేషధారణతో అందరినీ అలరిస్తున్నారు. మొత్తానికి ప్రత్యేక కేకులతో, భక్తి పాటలతో ఏసయ్య నామాన్ని స్మరిస్తూ జంట నగర క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment