ఊరి మీదకు చిరుత
దొడ్డబళ్లాపురం: జనావాసంలోకి చిరుత రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. కనకపుర తాలూకా అళ్లిమారనహళ్లి గ్రామంలో బోరేగౌడ అనే వ్యక్తి ఇంటి గోడపై చిరుత రాత్రి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాంపౌండ్‌లో కట్టేసిన పెంపుడు కుక్కపైన అది దాడి చేసింది. కుక్క గట్టిగా మొరగడంతో చిరుత తోక ముడిచింది. చిరుత వస్తోందని తెలిసి గ్రామస్తులు కలవరానికి గురయ్యారు. తక్షణం బోను పెట్టి బంధించాలని అటవీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాగానే జనం బయటకు రావాలంటే వణికిపోతున్నారు.
క్లాస్‌లోకి సర్పం
దొడ్డబళ్లాపురం: స్కూల్‌లోకి పాము రావడంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన కనకపుర తాలూకా కోనమానహళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. క్లాసులోకి హఠాత్తుగా ఒక పాము ప్రవేశించింది. దీంతో పిల్లలు భయంతో బయటకు పరుగులు తీసారు. టీచర్లు స్నేక్ కిరణ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్ర వాతావరణం ఉండడం వల్లే ఇలా జరిగిందని, పరిశుభ్రతను పాటించాలని స్థానికులు కోరారు.
అంబారీ బస్సులు ప్రారంభం
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ 20 అంబారీ ఉత్సవ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం మంత్రులు రామలింగారెడ్డి, దినేశ్‌గుండూరావ్‌లు బెంగళూరులో ప్రారంభించారు. 20 బస్సులను బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైవర్ కం కండక్టర్ పోస్టులకు తాత్కాలిక సిబ్బందిని నియమించారు. రోజు 8,896 వాహనాలతో 8,093 మార్గాలలో 28.70 లక్షల కిలోమీటర్లు, 35.43 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు మంత్రి రామలింగారెడ్డి తెలిపారు.
లంచగొండి పీడీఓకు సంకెళ్లు
శివమొగ్గ: ఇంటి ఈ–ఖాతా చేసి ఇచ్చేందుకు లంచం తీసుకున్న గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) లోకాయుక్తకు చిక్కాడు. ఈ ఘటన మంగళవారం జిల్లాలోని సొరబ పట్టణంలో జరిగింది. వివరాలు.. ఫిర్యాదుదారుడు మహ్మద్ గౌస్ తన తండ్రిపేరిట ఉన్న పొలానికి ఈ– ఖాతా చేసివ్వాలని ఇన్‌చార్జి పీడీఓ ఈశ్వరప్పకు దరఖాస్తు చేశాడు. ఆ స్థలం కొలతలను తీసుకున్నారు కానీ ఈ–ఖాతా మాత్రం చేసివ్వలేదు. రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సొరబ పట్టణ పోస్టాఫీసు కార్యాలయం వద్ద లంచం సొమ్ము తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి జరిపి ఈశ్వరప్పను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లోకాయుక్త ఎస్పీ మంజునాథ్ చౌధరి, ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.
రూ.20 వేలకు గొడవ..
ఒకరి హత్య
బనశంకరి: మాంసం దుకాణం వ్యాపారంలో రూ.20 వేల గురించి గొడవలు వచ్చి హత్య చోటుచేసుకుంది. ఈ ఘటన నగరంలో బేగూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. శివాజీనగర నివాసి అఫ్సర్ (45) హతుడు. 8 నెలల క్రితం అఫ్సర్, అక్బర్ కలిసి మటన్ షాపును ప్రారంభించారు. అక్కడ సరిపడక వేరే షాపు పెట్టుకోవాలని అక్బర్ నిర్ణయించాడు. పెట్టుబడి డబ్బు వెనక్కి ఇవ్వాలని అఫ్సర్‌ను అడిగాడు. దీంతో సుమారు రూ.3 లక్షలు నగదు వెనక్కి ఇచ్చారు. కానీ రూ.20 వేల విషయంలో గొడవ జరిగింది. తోపులాట జరిగి ఆవేశానికి గురైన అక్బర్ దుకాణంలో ఉన్న కొడవలితో తలపై దాడిచేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అఫ్సర్ అక్కడే చనిపోయాడు. పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని సెయింట్‌జాన్స్ ఆసుపత్రికి తరలించారు. నిందితున్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment