నూతన సంతోషం.. సంబరం
బనశంకరి: ఎన్నో తీపి చేదు గుర్తులను అందించిన 2024 సంవత్సరానికి భారంగా వీడ్కోలు, కోటి ఆశలతో 2025 కు స్వాగతం పలుకుతూ ఐటీ సిటీ వాసులు సంబరాలు చేసుకున్నారు. నగరమంతటా వేడుకలతో మార్మోగింది. మంగళవారం అర్ధ రాత్రి గడియారంలో ముల్లు 11.59 దాటి 12.00 చూపింగానే ప్రజలు గొంతెత్తి బైబై 2024, హ్యాపీ న్యూ ఇయర్ 2025 అంటూ కేరింతలు కొడుతూ ఘన స్వాగతం పలికారు. చిందులు, ఆలింగనాలతో సంతోష సాగరంలో మునిగిపోయారు.
అన్ని వీధుల్లో సందోహం
మంగళవారం సాయంత్రం కాగానే బెంగళూరువాసులు వేడుకల కూడళ్లకు రావడం మొదలైంది. వైవిధ్యమైన దుస్తులు ధరించిన యువతీ యువకులు బ్రిగేడ్ రోడ్డు, ఎంజీ రోడ్డు, చర్చ్ స్ట్రీట్, రెసిడెన్సీ రోడ్డు, కమర్షియల్ స్ట్రీట్, ఒపెరా జంక్షన్, రెస్ట్ హౌస్ రోడ్డు, సెయింట్ మార్క్స్ రోడ్డు, రిచ్‌మండ్ రోడ్డు, మల్లేశ్వరం సంపిగేరోడ్డు, కోరమంగల నేషనల్ గేమ్ విలేజ్, యుకో బ్యాంక్ రోడ్డు, ఇందిరానగర 100 ఫీట్ రోడ్లలో కిక్కిరిసిపోయారు. విద్యుత్ కాంతులు, మైక్‌లలో సంగీతం హోరు వారిలో ఉత్సాహం నింపింది. మద్యం, బీర్లు వెల్లువలా పారాయి. మరోవైపు క్లబ్‌లు, పబ్‌ల్లోకి యువతీ యువకులు చేరుకుని డీజే మ్యూజిక్‌తో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు.
కార్యక్రమాల హోరు
స్టార్ హోటళ్లు, పార్టీ హాళ్లలో తారలు, గాయకులతో ప్రదర్శనలు ఉర్రూతలూపాయి. ప్రముఖ హోటల్స్‌లో సెలబ్రెటీ డీజేలు తమ ప్రదర్శనతో మైమరపించారు. హోటల్ లలిత్ అశోక్‌లో గాయని ఉషా ఉత్తప్, డీజే హర్ష బటౌని గానంలో రంజిపంజేశారు. కోరమంగల గిల్లీస్ రీడిఫైన్‌లో డీజే హంశ్, డీజై హైషి, షెర్టాన్ గ్రాండ్‌లో నిఖిల్ చినప్ప, ఎంజీ రోడ్డు తాజ్‌లో సెబ్రినా టెరన్స్ ప్రదర్శనలు అలరించాయి. పంజాబీ, పాప్, బెల్లీ డాన్స్ షోలు అబ్బురపరిచాయి.
కిక్కిరిసిన మెట్రో రైళ్లు
రాత్రికి నమ్మ మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రాత్రి 11 గంటల తరువాత రైళ్లలో నిలబడడానికి కూడా చోటు లేదు. ట్రినిటి, కబ్బన్ పార్కు స్టేషన్లలో రద్దీ మిన్నంటింది. తెల్లవారుజామున 2.45 వరకు మెట్రో రైళ్లు తిరిగాయి.
లాఠీలకు పని
● నగర పోలీస్‌కమిషనర్ బీ.దయానంద్, డీసీపీలు శేఖర్, సారా ఫాతిమాలు శాంతి భద్రతలను తనిఖీలు చేశారు.
● రాత్రి 12 గంటలు దాటాక సంబరాల్లో మునిగిపోయిన యువతీ యువకులను పోలీసులు లాఠీలతో అక్కడ నుంచి చెదరగొట్టారు.
2025కి ఘన స్వాగతం
రాజధానిలో వేడుకల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment