ఆధ్యాత్మికతతో శాంతికి నాంది
చెళ్లకెరె రూరల్: సమాజంలో ప్రతి వ్యక్తి ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటాడు. యువకులు, మహిళలు, వృద్ధులు అందరికీ శాంతి అనేది కావాలి. వృత్తి జీవితంలో విధులు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక చింతనలను అలవరుచుకున్నప్పుడే శాంతి లభించడం సాధ్యమని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎఫ్.దేశాయి అన్నారు. ఆయన స్థానిక ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో విశ్వశాంతి దినాచరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాపిత బ్రహ్మబాబా జీవిత చరిత్ర గురించి బ్రహ్మకుమారి రష్మి అక్క విచ్చేసిన భక్తులకు తెలిపారు. ఆధ్యాత్మిక సాధనలు చేసి మనసును దృఢంగా ఉంచుకొని జీవించి శాంతికి చిహ్నంగా నిలవాలన్నారు. అనంతరం సీఐ దేశాయిని సన్మానించారు.
ప్రత్యేక మండలి
ఏర్పాటుకు వినతి
రాయచూరు రూరల్: ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల కోసం మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి సంతోష్ లాడ్‌ని ప్రైవేట్ వాహన డ్రైవర్ల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జెడ్పీ సభాంగణంలో సంఘం పదాధికారులతో కలిసి అధ్యక్షుడు సాదిక్ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రైవేట్ వాహన డ్రైవర్ల కోసం ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం, గాయపడ్డవారికి రూ.10 లక్షలు పరిహారం అందించాలని, ప్రమాద బీమా పాలసీ అమలు చేయాలని, తమ పిల్లలకు విద్యాభ్యాసం కోసం 25 శాతం ఫీజులు భరించాలని కోరారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర, సంగమేష్, రఫీ తదితరులున్నారు.
ఎస్సీ దంపతులకు పాదపూజ
బళ్లారిఅర్బన్: భీమా సంగమ అభియాన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ సమాజ బాంధవులు జగన్నాథ మాదిగ దంపతులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ నాయుడు నివాసంలో పాదపూజ, ఘన సన్మానం ద్వారా ఆ వర్గాలకు గౌరవ ప్రపత్తులను ప్రకటించారు. కేఎంఎఫ్ మాజీ చైర్మన్, నగర మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, ప్రముఖులు ప్రసన్న జీ, సఫాయి కర్మచారుల మండలి మాజీ అధ్యక్షుడు హనుమంతప్ప, ఆ పార్టీ కార్పొరేటర్లు హనుమంత, మోత్కర్ శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నవలిని సత్వరంనిర్మించరూ
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పేరుకు పోయిన పూడికతో డ్యాంలో తగ్గిన నీటి లోటు భర్తీకి నవలి వద్ద నిర్మించదలపెట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను త్వరగా నిర్మించాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు అమీనుద్దీన్ డిమాండ్ చేశారు. సోమవారం సింధనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందడం గగనమైందని, ఈ నేపథ్యంలో నవలి వద్ద సమాంతర జలాశయ నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు, ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
తల్లీబిడ్డల అదృశ్యం
బళ్లారిఅర్బన్: సండూరు తాలూకా డీ.అంతాపుర గ్రామానికి చెందిన తల్లీబిడ్డలు అదృశ్యమయ్యారు. వివరాలు.. గ్రామానికి చెందిన సరస్వతి అనే 30 ఏళ్ల మహిళ, సృజన్ అనే 4 ఏళ్ల బాలుడు గత నవంబర్ నెల నుంచి కనిపించకుండా పోయారు. వారి ఆచూకీ కోసం అన్ని చోట్లా గాలించినా ఫలితం లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తోరణగల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లీబిడ్డ కన్నడ, తెలుగులో మాట్లాడగలరని, వారి ఆచూకీ తెలిసిన వారు తోరణగల్లు పోలీస్ స్టేషన్ డీఎస్పీ– 9480803010, 9080803036 నెంబర్లలో సంప్రదించాలని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment