ఆవిర్భావం అదిరేలా..!
సింగరేణి డే వేడుకలకు సిద్ధం
● ముస్తాబైన ప్రకాశం స్టేడియం ● ముఖ్యఅతిథిగా సింగరేణి సీఎండీ ● సాధించిన అభివృద్ధి తెలిపేలా 27 స్టాళ్ల ఏర్పాటు
సింగరేణి(కొత్తగూడెం): తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తూ.. లక్షలాది మందికి జీవనోపాధి కలుగజేస్తున్న సింగరేణి సంస్థ ఈనెల 23న ఆవిర్భావ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమైంది. అనేక సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ రంగ సంస్థలకే తలమానికంగా మారి 136 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ సింగరేణి డే వేడుకలు పేరిట నేడు కోల్‌బెల్ట్ ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో నిర్వహించనున్నారు. ఈనేపథ్యాన కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని ప్రకాశం స్టేడియంలో ప్రధాన వేడుకలు జరిపేందుకు ముస్తాబుచేయగా.. సంస్థ అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసేలా స్టేడియంలో సంస్థ దాదాపు 27 స్టాళ్లను ఏర్పాటు చేస్తుంది.
తొలిసారి సీఎండీ రాక..
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో బలరామ్ తొలిసారిగా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో వేడుకలకు వచ్చే కార్మికులు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తుంది. జీఎం పర్సనల్ (వెల్ఫేర్ అండ్ ఆర్సీ) కోడూరి శ్రీనివాస్‌రావు కన్వినర్‌గా వ్యవహరిస్తూ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ముస్తాబైన ప్రధాన కార్యాలయం
సింగరేణి ఆవిర్భావ వేడుకల సందర్భంగా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముస్తాబైంది. సింగరేణి డైరెక్టర్లు తొలుత ఈ కార్యాలయంలో పతాకావిష్కరణ చేయనుండగా కార్యాలయ ఆవరణలో తివాచీలు ఏర్పాటు చేశారు. అలాగే కార్యాలయం ముందు, లోపల భాగాల్లో విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో అలంకరించారు. రాత్రి సమయంలో శుభాకార్యాన్ని తలపించేలా కార్యాలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు.
ప్రత్యేక ప్రదర్శనలు..
సాయంత్రం ప్రముఖ సినీ గాయకులు ధనుంజయ్, ప్రణిత, శృతిక, సముద్రాలచే సినీ సంగీత విభావరి, తరువాత సీతా ప్రసాద్ బృందంచే ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, ఈటీవీ ఢీ విజేత బాబీ టీమ్ నృత్య ప్రదర్శన, ఆ తర్వాత ఇండియన్ టాప్ మెజీషియన్ అలీచే మ్యాజిక్ షో, చైన్నె కళాకారులు ట్విన్ జగ్లర్స్, అశోక్– ఆనంద్ వారి స్పెషల్ యాక్ట్ ప్రదర్శించనుండగా యాంకర్‌గా విజయ వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment