చైర్మన్ పీఠంపై ఉత్కంఠ?
● భద్రాచలం ట్రస్ట్ బోర్డు పదవి కోసం తీవ్ర పోటీ ● పాలక మండలి జాబితాలో చోటుపై టెన్షన్ టెన్షన్ ● ముక్కోటి వేడుకల్లో అధికారిక హోదాలో పాల్గొనాలనే ఉత్సాహం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పాలక మండలి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘ కాలం తర్వాత పాలక మండలి ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆశావాహులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్, మండలి సభ్యుల్లో చోటుకోసం సుమారు 50కు పైగా దరఖాస్తులు ఖమ్మం దేవాదాయ శాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. గడువు ఈ నెల 15న పూర్తి కావడంతో ఆ శాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారు సమర్పించిన డేటాను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే దరఖాస్తుల జాబితాను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపనున్నారు. అనంతరం దేవా దాయ శాఖ మంత్రి పరిశీలించి తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి చైర్మన్‌తోపాటు సభ్యుల పేర్లను ప్రకటించే అవకాశంఉంది. మరో పది రోజు ల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రేసులో మల్లు నందిని, బాలసాని?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ట్రస్ట్ బోర్డు నియమాకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రోటోకాల్ ఉన్న చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రభుత్వం సైతం నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా పార్టీలకు సేవలందించిన, పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులకు చైర్మన్ పదవి కేటాయించాలని భావిస్తోంది. దీంతో పలువురు తమ పరపతి, పలుకుబడితో రాష్ట్రస్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాకు చెందిన ఓ మంత్రి ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చైర్మన్ రేసులో ఉన్నట్లు కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. భద్రాచలం కేంద్రంగా రాజకీయ అనుభవం, స్థానికత ఆధారంగా ఆయన చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి మల్లు విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా చైర్మన్ పదవి ఆశిస్తున్నారనే ప్రచారం వారం రోజులుగా సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి భట్టి విక్రమార్కకు జిల్లా వ్యాప్తంగా అనుచరగణం మద్దతు సైతం ఉంది. ఖమ్మం ఎంపీ సీటును కూడా ఎన్నికల్లో త్యాగం చేయటంతో ప్రొటోకాల్, ఆధ్యాత్మికత ప్రాముఖ్యం ఉన్న రామాలయం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవి మల్లు నందినిని వరించే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. వీరితోపాటు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలో వరంగల్ ప్రతినిధిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి, రామాలయం మాజీ పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన ఓ ప్రముఖుడు మహబూబాబాద్ ఎంపీ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు.
దరఖాస్తుదారుల్లో టెన్షన్
పాలక మండలి జాబితాలో తమ పేరు వచ్చేనా? ఏ క్షణంలో ఏం జరుగుతుందో? అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పట్టువీడకుండా హైదరాబాద్‌లోనే మకాం వేసి మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీ చేస్తున్నారు. కాగా జనవరి 9, 10వ తేదీల్లో తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 1 నాటికి ట్రస్ట్ బోర్డు జాబితా వస్తే ప్రమాణ స్వీకారం అనంతరం ఆ హోదాలో ముక్కోటి ఉత్సవాల్లో పాల్గొనాలని తహతహలాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment