నత్తనడకన వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన వసూళ్లు

Published Mon, Dec 23 2024 12:47 AM | Last Updated on Mon, Dec 23 2024 12:47 AM

నత్తన

నత్తనడకన వసూళ్లు

ఖమ్మంమయూరిసెంటర్‌: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి, నిర్వహణ అంతా వాటికి వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. కార్పొరేషన్లకు ఆదాయ వనరులో ఆస్తి, పంపు పన్నులతో పాటు ట్రేడ్‌ లైసెన్సుల ద్వారా వచ్చే ఫీజులే ప్రధానం. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయంలో ఆస్తి పన్నే కీలకంగా ఉంటుంది. ఖమ్మం కార్పొరేషన్‌ 60 డివిజన్లలో విస్తరించి ఉండగా ఆస్తిపన్ను రూపంలో రూ.30 కోట్ల మేర ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో ప్రతి నెల నిర్వహణకు ఖర్చు చేయడంతో పాటు చిన్న చిన్న అభివృద్ధి పనుల బిల్లులు చెల్లిస్తారు. ఏటా లక్ష్యాన్ని చేరుకునేందుకు నెలల వారీగా విభజించుకుని మరీ సిబ్బందితో క్షేత్ర స్థాయిలో పన్నులు వసూలు చేయిస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం అటు కేఎంసీ, ఇటు మున్సిపాలిటీల్లో పన్నుల వసూలు నత్తనడకన సాగుతోంది. దీంతో ఖజానాలు నిండుకుంటుండగా, నెలవారీగా వచ్చే ఆదాయం తగ్గుముఖం పడుతుండగా నిల్వ ఉన్న నిధులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రూ.16.18 కోట్లు మాత్రమే వసూలు

2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పన్నుల వసూళ్లలో అధికారులు పూర్తి స్థాయి దృష్టి సారించడం లేదనే చర్చ జరుగుతోంది. ఏటా పన్నుల వసూలుకు నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రతి రోజు పన్నుల వసూలు చేసేలా బిల్‌ కలెక్టర్లకు సూచనలు చేసేవారు. అయితే ఈ ఏడాది పలు కారణాలతో పన్నుల వసూలులో కేఎంసీ సిబ్బంది వెనుకబడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.16.18కోట్ల పన్నులు మాత్రమే వసూలు చేశా రు. ఇందులో ఆస్తిపన్ను రూ.15.04 కోట్లు కాగా.. నల్లా పన్నులు రూ.84.65 లక్షలు, ట్రేడ్‌ లైసెన్సుల ఫీజు రూ.29.76 లక్షలుగా ఉంది. ఈ ఏడాది పన్నుల ద్వారా రూ.34 కోట్లకు పైగా వసూలు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా.. అందులో ఆస్తి పన్ను ద్వారా రూ.32 కోట్లు వసూలు చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌ లో ఎర్లీ బర్డ్‌ ద్వారానే రూ.9.73 కోట్లు రాబట్టారు. ఆపై మే నెల నుండి ఇప్పటి వరకు రూ.5.31 కోట్లే వసూలు చేయగా మరో మూడు నెలల్లో ఆస్తి పన్ను రూపంలో ఇంకా సుమారు రూ.17 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

అదనపు పనులతోనే జాప్యం..

కేఎంసీతో పాటు మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు రెవెన్యూ విభాగం కీలకంగా ఉంటుంది. ఈ విభాగంలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో బిల్‌ కలెక్టర్లు పన్నులు వసూలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో మున్సిపాలిటీ సిబ్బంది కీలకంగా వ్యవహరించారు. బిల్‌ కలెక్టర్లకు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన విధులను కేటాయించడంతో పన్నుల వసూలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఖమ్మంకు వచ్చేసరికి సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వరద బాధితుల సర్వే, వారికి సహాయ కార్యక్రమాలు, ఇతర పనులపై దృష్టి పెట్టారు. ఇక నవంబర్‌లో అన్ని చోట్ల కుల గణన సర్వే, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలకు వీరినే ఉపయోగిస్తుండడంతో పన్నుల వసూళ్లలో జాప్యం జరుగుతోంది.

ప్రణాళికలు లేకుంటే కష్టమే..

ఆస్తి పన్నుల వసూళ్లలో ఎర్లీ బర్డ్‌ స్కీం ఉండే ఏప్రిల్‌తో పాటు ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలే కీలకం. ఎర్లీ బర్డ్‌ స్కీంలో ఈ ఏడాది ఆస్తి పన్నులను భారీగానే వసూలు చేసినా.. లక్ష్యం మాత్రం ఇంకా ఎక్కువగానే మిగిలి ఉంది. ఒక్క ఖమ్మం కార్పొరేషన్‌లోనే ఆస్తి, పంపు, ట్రేడ్‌ లైసెన్స్‌ల ద్వారా ఈ ఏడాది ఇంకా రూ.18 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇకనైనా ప్రణాళికాయుతంగా ముందుకు సాగకపోతే ఈ ఏడాది వెనుకబడే ప్రమాదముందని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం

కేఎంసీ నిర్వహణలో

పన్నులదే సింహభాగం

ఇతర మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి

కానీ సర్వేలు, ఇతర విధులతో

సిబ్బంది బిజీ

పన్నుల వసూలుపై

దృష్టి సారించలేకపోతున్న వైనం

కేఎంసీలో రూ.34కోట్ల లక్ష్యానికి రూ.16.18 కోట్లే వసూలు

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల వివరాలు.. (రూ. కోట్లలో)

కార్పొరొషన్‌ / లక్ష్యం వసూలు

మున్సిపాలిటీ

ఖమ్మం 32 15.04

మధిర 2.49 1.05

సత్తుపల్లి 4.79 2.35

వైరా 2.45 75.43 లక్షలు

కొత్తగూడెం 47.81 29.78

పాల్వంచ 6.00 3.30

ఇల్లెందు 26.52 11.33

మణుగూరు 1.42 75.50 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
నత్తనడకన వసూళ్లు1
1/1

నత్తనడకన వసూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement