విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
డీఈఓ సోమశేఖరశర్మ
ఖమ్మంరూరల్ : దేశానికి శాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉందని, అసక్తి గల విద్యార్థులు ఆ దిశగా తమ లక్ష్యాలను ఎంచుకోవాలని డీఈఓ సోమశేఖరశర్మ అన్నారు. మండలంలోని పోలేపల్లిలో గల గురుదక్షిణ ఫౌండేషన్‌లో గణిత మేధావి శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా మొత్తం 59 పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులకు ఆదివారం క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోవాలని, పరిశోధనల రంగం వైపు ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. అనంతరం విజేతలకు సైకిళ్లు, గడియారాలు, డిజిటల్ ట్యాబ్‌లు బహుమతులుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జగదీశ్వర్, శంకరయ్య, పి. వెంకటేశ్వర రావు, డి. భిక్షమయ్య, సత్యనారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు సకల
సౌకర్యాలు కల్పిస్తున్నాం
ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ
ఖమ్మంమయూరిసెంటర్ : జిల్లాలోని ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మంలోని ఎస్సీ బాలికల ఏ వసతిగృహంలో విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేసి, హాస్టల్‌లో మోడల్ స్టోర్‌ను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతీ రోజు ఉదయం అల్పాహారం, రాగిజావ, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, గుడ్లు, పండ్లు అందజేస్తున్నామని వివరించారు. వీటితో పాటు భోజనంలో మాంసాహారం ఏర్పాటు చేశామన్నారు. పదో తరగతి విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించామన్నారు. ఆయన వెంట వసతిగృహ సంక్షేమ అధికారిణి ఎన్.విజయ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment