31న అరుణోదయ స్వర్ణోత్సవ సభ
ఖమ్మం మామిళ్లగూడెం : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో ఈనెల 31న స్వర్ణోత్సవ సభ నిర్వహించనున్నట్లు సంఘం భద్రాద్రి జిల్లా కార్యదర్శి ముత్యాలరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యోగానందం, కార్యదర్శి గడ్డం లక్ష్మణ్ తెలిపారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. సభ సందర్భంగా వైరాలో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, అనంతరం గాంధీ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్‌లో కళాకారులతో ధూమ్‌ధామ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 1975 నుంచి నేటి వరకు వేలాది మంది కళాకారులు అరుణోదయ సంఘంలో పనిచేశారని, 50 సంవత్సరాల కాలంలో అనేక రుగ్మతలపై కళారూపాలు రూపొందించామని వివరించారు. శ్రీకాకుళం ఉద్యమంలో సుబ్బారావు పాణిగ్రాహి, చినబాబు, గోదావరి లోయ రైతాంగ పోరాటంలో అరుణోదయ రామారావు వంటి కళాకారులు తమ జీవితాలను ప్రజల కోసం అంకితం చేశారని, వారి ఆశయ బాటలో నేటి కళాకారులు పయనించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఆరెంపల వెంకన్న, కత్తుల మల్లయ్య, మహంకాళి వెంకన్న, కొట్టె సీతారాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment