నగరాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం నగరాభివృద్ధికి ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నగరంలోని 57వ డివిజన్ రమణగుట్టలో రూ.85 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు భూమి ఇచ్చిన మదన్‌కు ధన్యవాదాలు తెలిపారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఇళ్లు లేని పేదలకు సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. హౌసింగ్ శాఖకు జిల్లాకు చెందిన మంత్రే ఉన్నందున ఖమ్మంలో ఎక్కువ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. అమృత్ పథకం నిధులు రూ.220 కోట్లతో నగరంలో నీటి సరఫరా పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వరదలతో ఖమ్మం నగరానికి ముంపు రాకుండా ఉండేందుకు రూ.250 కోట్లు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. మున్నేరుకు రెండువైపులా రిటైనింగ్ వాళ్లు నిర్మిస్తామన్నారు. 500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్భన్ పార్క్‌ను నెహ్రూ జులాజికల్ పార్క్‌లా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లేదంటే వారిపైనే చర్య తీసుకుంటామని హెచ్చరించారు. రూ.249 కోట్లతో భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని అన్నారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే ఎమ్మెల్యేను ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నుకున్నారని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్ధ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, కార్పొరేటర్లు రఫీదాబేగం, కమర్తపు మురళి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ ముస్తఫా, ఎల్‌ఐసీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్లు
నగరంలో నీటి సరఫరాకు
రూ.220 కోట్లతో పనులు
మున్నేరుకు రెండు వైపులా
రిటైనింగ్ వాల్
వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment