మెరుపులు.. మరకలు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో విద్యాశాఖ పనితీరు ఈ ఏడాది తొలినాళ్లలో సాఫీగా సాగగా, చివరకు వచ్చేసరికి అప్రతిష్ట పాలయ్యేలా ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా బడుల్లో అభివృద్ధి జరగగా ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకున్నాయి. అలాగే, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరగడంతో కొరత తీరినట్లయింది. అంతేకాక ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నట్లుగా పదోన్నతుల ప్రక్రియ సాఫీగా పూర్తి చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ డీఎస్సీ ద్వారా జరిగిన నియామకాల్లో అధికారుల నిర్లక్ష్యంతో కొందరిని తొలగించాల్సి రావడం, పదోన్నతుల విషయంలోనూ అలాగే జరగడంతో మరక పడినట్లయింది.
955 బడుల్లో పనులు
జిల్లాలోని 1,216 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా... సుమారు 75వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జూన్‌లో చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా 10,065మంది విద్యార్థులను చేర్పించారు. అలాగే, పాఠశాల తెరిచిన రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం ఇవ్వడం విశేషం. ఇక గతంలో మాదిరి కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, పర్యవేక్షణకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను నియమించారు. ఇందులో భాగంగా 955 పాఠశాలలను ఎంపిక చేయగా రూ.35కోట్లు కేటాయించారు. తొలి దశలో 860పాఠశాలల్లో సుమారు రూ.20కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అంతేకాక 50పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేశారు. కాగా, 2023–2024 విద్యాసంవత్సరానికి పరిశీలిస్తే ఎస్సెస్సీ ఉత్తీర్ణత శాతం 92.24 శాతంగా నమోదైనా గత ఏడాదితో పోలిస్తే తగ్గింది.
534మంది కొత్త టీచర్లు
2024 డీఎస్సీ నియామకాలు సాఫీగా సాగాయి. ఈ ప్రక్రియలో 534మంది ఉపాధ్యాయులు నియమితులయ్యారు. సుమారు 15సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి. దీంతో చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత తీరినట్లయింది. అయితే, హిందీ పండిట్ల నియామకంలో ఏడుగురు అనర్హులని తేల్చి 20రోజుల తర్వాత తొలగించడం గమనార్హం. అలాగే, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఏడుగురికి పదోన్నతి కల్పించిన అధికారులు కొన్నాళ్ల తర్వాత వారిలో ఆరుగురిని అనర్హులుగా తేల్చి రివర్షన్ చేయడంతో పర్యవేక్షణలోపంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇది కాక విద్యాశాఖలోని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.1.82కోట్ల నిధులను దారి మళ్లించడం చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్‌లో..
జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం పాలేరు నియోజకవర్గానికి కొత్తగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది. మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 71.93శాతం, ద్వితీయ సంవత్సరంలో 80.44శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇటీవల ఒక్కో జూనియర్ కళాశాలలో ల్యాబ్‌కు రూ.25వేలు, సీసీ కెమెరాలు, మరమ్మతుల కోసం మరో రూ.6వేలు నిధులు విడుదలవడంతో నిర్వహణ భారం తప్పినట్లయింది.
ఏడాది చివరలో విమర్శలు ఎదుర్కొన్న విద్యాశాఖ
‘అమ్మ’ కమిటీలతో పాఠశాలల అభివృద్ధి
కొత్త టీచర్ల నియామకం, పదోన్నతులు
లోపభూయిష్టమైన విధానాలతో ఆఖరుకు అప్రతిష్ట
బదిలీలు, పదోన్నతులు
జిల్లాలో ఉపాధ్యాయులుగా ఏళ్లుగా బదిలీలు, పదోన్నతుల కోసం ఎదురుచూశారు. వీరికి ఊరట కలిగించేలా ప్రభుత్వం నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో 1,034మంది ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతి లభించాయి. అలాగే, 1,884మంది ఉపాధ్యాయులను కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment